కాంగ్రెస్ కుంటిసాకులు చెప్తోంది: టీఆర్ ఎస్

Update: 2018-12-19 07:32 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎదురైన ఘోర ప‌రాభ‌వానికి కాంగ్రెస్ నేత‌లు కుంటి సాకులు చెప్తున్నార‌ని టీఆర్ ఎస్ ఎద్దేవా చేసింది. ఒక‌సారి ఈవీఎంలను మాయ చేశార‌ని ఆరోపిస్తే.. మ‌రోసారి చంద్ర‌బాబుతో పొత్తే పుట్టి ముంచిద‌ని వాదిస్తూ త‌ప్పించుకు తిరుగుతున్నార‌ని విమ‌ర్శించింది. ఓట‌మిని అంగీక‌రించే ధైర్యం వారికి ఎంత‌మాత్ర‌మూ లేదని అభిప్రాయ‌ప‌డింది.

తెలంగాణలో పెండింగ్‌ ప్రాజెక్టుల‌ను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ - రవిశంకర్‌ ప్రసాద్ ల‌ను టీఆర్ ఎస్‌ ఎంపీలు మంగళవారం క‌లిశారు. అనంత‌రం నిర్వ‌హించిన‌ మీడియా స‌మావేశంలో క‌విత మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మికి కాంగ్రెస్ కుంటి సాకులు వెతుకుతోంద‌ని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమికి కార‌ణం ఈవీఎంల ట్యాంపరింగ్ అని తొలుత పేర్కొన్న సంగ‌తిని గుర్తుచేశారు. ఇప్పుడేమో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం - టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో పొత్తు వ‌ల్లే ఓడిపోయామ‌ని అంటున్నార‌ని తెలిపారు.

వ‌చ్చే లోక్‌ స‌భ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ తెలంగాణ‌లో 16 ఎంపీ సీట్లు గెల్చుకుంటుంద‌ని క‌విత ధీమా వ్య‌క్తం చేశారు. జాతీయ రాజ‌కీయాల్లో ఇక‌పై తాము కీల‌క భూమిక పోషిస్తామ‌ని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మ‌హబూబ్‌ నగర్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి విమ‌ర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా కల్పించాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశామన్నారు. తక్షణమే హైకోర్టును విభజించాలని ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ను కోరిన‌ట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కేంద్రం జాప్యం చేస్తుందని జితేంద‌ర్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీది కేవ‌లం మాట‌ల ప్ర‌భుత్వ‌మంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎంపీ వినోద్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ ఎస్‌ ను గెలిపించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని అన్నారు. అసెంబ్లీ రద్దు తర్వాత కూటమి ఏర్పాటయిందని గుర్తుచేశారు. కూటమి కట్టకముందే కాంగ్రెస్‌ ఓడిపోయిందంటూ ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News