పార్టీల్లో పోస్టులు పెరుగుతున్నాయ్‌

Update: 2016-10-09 07:13 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పెంపు నిర్ణ‌యం ఇప్పుడు అన్ని పార్టీల నేత‌ల్లోనూ ఉత్సాహం నింపుతోంది. జిల్లాల సంఖ్య‌ను పెంచ‌డం ద్వారా రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ ప‌క్షాల్లోనూ పోస్టులు పెర‌గ‌నుండ‌డ‌మే దీనికి కార‌ణం. ప్ర‌స్తుతం  10 జిల్లాలే ఉండ‌డంతో ఆయా జిల్లాల్లో పార్టీల‌కు క‌మిటీలు - వాటికి జిల్లా నాయ‌క‌త్వం బాధ్య‌త వ‌హిస్తోంది. ఇక‌, ద‌స‌రా త‌ర్వాత జిల్లాల సంఖ్య పెర‌గ‌నుండ‌డంతో పెరుగుతున్న జిల్లాల‌కు పార్టీలు క‌మిటీల‌ను వేయాల్సి వ‌స్తోంది. దీనివ‌ల్ల స్థానికంగా ఎప్ప‌టి నుంచో పార్టీకి సేవ చేస్తూ.. గుర్తింపు రాలేద‌ని భావిస్తున్న కార్య‌క‌ర్త‌లు - నేత‌ల‌కు ఇప్పుడు ప‌ద‌వుల యోగం ప‌ట్ట‌నుంద‌ని తెలుస్తోంది.

వాస్త‌వానికి తెలంగాణ జిల్లాలు 10 నుంచి ఖ‌చ్చితంగా 31 కానున్నాయి. మున్ముందు ఒక‌టి రెండు పెరిగే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే మాత్రం 31 క‌న్ఫ‌ర్మ్ చేశారు. దీనిని అనుస‌రించి ఆయా జిల్లాల్లో అధికార టీఆర్ ఎస్ స‌హా బీజేపీ - కాంగ్రెస్ - టీడీపీ - వైకాపా - సీపీఎం - సీపీఐ త‌దిత‌ర అన్ని ప‌క్షాలూ త‌మ నాయ‌క‌త్వాల‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇప్ప‌టి నుంచి ఆయా పార్టీలు త‌మ క‌స‌ర‌త్తును ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న జిల్లాల ప‌రిధులు - మండ‌లాలు - పంచాయితీల ప‌రిధులు కూడా మారిపోనున్నాయ‌ని తెలుస్తోంది కాబ‌ట్టి.. క్షేత్ర‌స్థాయిలోనే ఆయా పార్టీలు త‌మ క‌మిటీల‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

దీంతో కింది స్థాయి నేత‌ల‌కు ప‌దవులు ద‌క్కే ఛాన్స్ పుష్క‌లంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో ప‌లు పార్టీల నేత‌లు స్పందిస్తూ.. త‌మ త‌మ పార్టీల‌కు నూత‌న నాయ‌క‌త్వ కూర్పును త్వ‌ర‌లోనే పార్టీ అధ్య‌క్షుని నాయ‌క‌త్వంలో నిర్ణ‌యం తీసుకుని ఏర్పాటు చేస్తామ‌ని చెబుతున్నారు. మొత్తంగా అన్ని పార్టీల్లోనూ జిల్లాల అధ్య‌క్షుడు - కార్య‌ద‌ర్శులు - మండ‌ల స్థాయిలోనూ పార్టీకి నేత‌ల‌ను ఎంపిక చేయ‌నున్న‌ట్టు ఆయా పార్టీల నేత‌లు ప్ర‌క‌టించారు. దీంతో కింది స్థాయి నేత‌ల్లో ఇప్పుడు ఉత్సాహం నెల‌కొంది.

నిజానికి  అన్ని పార్టీల్లోనూ కింది స్థాయి నేత‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌ర‌క‌మైన నీర‌సం ఆవ‌హించింది. తాము ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా గుర్తింపు రావ‌డం లేద‌ని - ఎలాంటి ప‌ద‌వులూ ద‌క్క‌డం లేద‌ని వారు ఆవేద‌న చెందుతున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణ‌యంతో జిల్లాల సంఖ్య పెరుగుతుండ‌డంతోపాటు పార్టీల్లో ప‌ద‌వుల సంఖ్యా పెరుగుతుండ‌డంతో కొత్త నాయ‌క‌త్వానికి అవ‌కాశం ల‌భించిన‌ట్ట‌యింద‌ని తెలుస్తోంది. ఇక‌, అన్ని పార్టీల్లోనూ పోస్టుల నియామ‌కం దాదాపు ఈ నెల లేదా న‌వంబ‌రు రెండో వారం నాటికి పూర్త‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News