గ్రేటర్‌ లో తెరాస పరిస్థితి దయనీయం!

Update: 2015-10-10 14:19 GMT
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రెండు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. కడియం శ్రీహరి రాజీనామా వల్ల ఖాళీ అయిన వరంగల్‌ ఎంపీ స్థానానికి ఒక ఎన్నిక అయితే.. కిష్టారెడ్డి మృతి వల్ల నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే స్థానంలో మరో ఎన్నిక. అధికార తెరాస ఈ రెండు స్థానాల్లో విజయంసాధించాలనే టార్గెట్‌ తో రంగంలోకి దిగుతోంది. అయితే మరో కీలకాంశం ఏంటంటే.. ఈ రెండు ఉప ఎన్నికలకంటే తెరాస భవిష్యత్తుకు సంబంధించి మరింత కీలకమైన క్లిష్టమైన ఎన్నికలు రెండు నెలల తర్వాత వేచి ఉన్నాయి. అవే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు. గ్రేటర్‌ ఎన్నికల్లో కూడా గెలవడానికి వారు రకరకాల ప్లానింగులతో ఉన్నారు గానీ.. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలనే కాస్త లోతుగా గమనిస్తే.. నగరంలో పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్లు అర్థమవుతుంది.

కొన్ని రోజుల కిందట పార్టీ కీలక నాయకులందరితోనూ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించినప్పుడు కేసీఆర్‌ త్వరలో ఎదుర్కొనబోతున్న ఎన్నికలకు సంబంధించి.. కొన్ని వివరాలను వెల్లడించారు. వరంగల్‌ ఉప ఎన్నికలో తమ పార్టీకి 67 శాతం విజయావకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఆ స్థానం విషయంలో సాధారణంగానే ఎవ్వరికీ ఎలాంటి అనుమానం లేదు. అది అసలే వారు ఖాళీ చేసిన సీటు. పైగా.. ఈ ఒక్క ఏడాదిలో అక్కడ ఇతర పార్టీలు విపరీతంగా బలపడిపోయిన దాఖలాలు కూడా లేవు. అందువల్ల అక్కడ గెలుపు నల్లేరుపై బండినడక అయిపోతుందనే వారు అనుకుంటున్నారు. ఇకపోతే నారాయణఖేడ్‌ సంగతి. నిజానికి ఇది గత ఎన్నికల్లో కాంగ్రెసు వారు గెలిచిన సీటు. అయితే.. ఇప్పటి ఉప ఎన్నికల్లో తమ పార్టీకి 52 శాతం గెలుపు అవకాశం ఉన్నదనికేసీఆర్‌ అంటున్నారు. అంటే అక్కడ గెలిస్తే.. గనుక.. ఈ ఏడాదిలో తమ ప్రభుత్వం మీద పెరుగుతున్న జనాదరణగా దాన్ని ఆయన ప్రచారం చేసుకుంటారన్నమాట.

ఇక చివరగా గ్రేటర్‌ సంగతే అసలు తకరారుగా ఉంది. ఇక్కడ జనవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నదని కేసీఆర్‌ అంటున్నారు. తమ పార్టీ గెలవడానికి వీలు కుదిరేలా, అలా అనడం కంటె.. ప్రత్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసేలా లక్షల ఓట్లు తొలగించేశారని, ఇందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ కేసీఆర్‌కు పార్టీ అనుచరుడిలాగా పనిచేశారని ప్రతిపక్షాలు పదేపదే విమర్శించాయి. దానికి తగ్గట్లు.. కేసీఆర్‌ కూడా గ్రేటర్‌లో విజయం గురించి ఏమీ మాట్లాడలేకపోతున్నారు. అసలే సార్వత్రిక ఎన్నికల్లోనే ఈ ప్రాంతంలో పార్టీ బలహీనత ఏంటో బయటపడింది. ఇప్పటికి కూడా పరిస్థితి ఏమీ మెరుగుపడిన సూచనలు లేవు. ఇంకా నగరంలో ఇతర పార్టీల నుంచి వలసల కోసం నిరీక్షిస్తున్నారు. అంతే తప్ప.. పార్టీ కంటూ సొంత బలం తక్కువ. ఎటుచూసినా సరే.. గ్రేటర్‌లో తెరాస పరిస్థితి దయనీయంగానే ఉన్నదని, అధినేతకు కూడా కాన్ఫిడెన్స్‌ లేదని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
Tags:    

Similar News