మ‌హాకూట‌మిపై ఆప‌రేష‌న్ గులాబీ ఆక‌ర్ష్‌?

Update: 2018-11-04 09:31 GMT
107 నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ‌ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి ప్ర‌చారంలో దూసుకుపోతున్న టీఆర్ ఎస్‌.. మ‌హా కూట‌మిలో సీట్ల పంప‌కాల త‌ర్వాత ఎలాంటి కార్యాచ‌ర‌ణ‌ను అనుస‌రించ‌బోతోంద‌నే విష‌యం ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సీట్ల పంప‌కం త‌ర్వాత కూట‌మి నేత‌లు సినిమా చూస్తారంటూ గులాబీ పార్టీ ముఖ్య నేత‌లు కేటీఆర్‌ - హ‌రీశ్ రావు - క‌విత‌లు ఇటీవ‌ల త‌ర‌చుగా చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు కార‌ణం. వారి మాట‌ల వెనుక అర్థం ఏమిటి? ఎందుకంత ధీమాగా ప‌దేప‌దే ఆ వ్యాఖ్య చేస్తున్నారు? అనే ప్ర‌శ్న‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల‌తోపాటు సాధార‌ణ‌ ప్ర‌జ‌ల్లోనూ ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.

ఆ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ అన్న‌ది విశ్లేష‌కుల వాద‌న‌. కూట‌మిలో సీట్ల పంప‌కం అనంత‌రం ప్ర‌ధానంగా కాంగ్రెస్‌ - టీడీపీ నేత‌ల‌పై టీఆర్ ఎస్ త‌మ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ వ‌ల‌ను విసిరే అవ‌కాశ‌ముంద‌ని వారు సూచిస్తున్నారు. రాష్ట్రంలో 95 సీట్ల‌లో కాంగ్రెస్ పోటీ చేయ‌డం దాదాపుగా ఖాయ‌మైంది. మిగిలిన 24 స్థానాల్లో టీడీపీ - టీజేఎస్‌ - సీబీఐ స‌ర్దుబాటు చేసుకోనున్నాయి. అయితే, ఈ 24 స్థానాల్లోనూ కాంగ్రెస్‌కు ప‌లువురు బ‌ల‌మైన నేత‌లు ఉన్నారు. పార్టీ టికెట్ ద‌క్క‌క‌పోతే రెబ‌ల్‌ గా బ‌రిలో దిగాల‌ని వారు యోచిస్తున్నారు. అలాంటి వారికి గాలం వేసి త‌మ పార్టీలో చేర్చుకోవాల‌న్న టీఆర్ ఎస్ వ్యూహ‌మే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ అని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ప్ర‌ధానంగా చూస్తే.. హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గాన్ని సీబీఐ బ‌లంగా కోరుకుంటోంది. అయితే, ఆ స్థానంలో కాంగ్రెస్ నేత అలిగిరెడ్డి ప్ర‌వీణ్ రెడ్డి ఇప్ప‌టికే ప్ర‌చారం చేసుకుంటున్నారు. పొత్తుల్లో హుస్నాబాద్ సీటు సీపీఐకి వెళ్తే.. ప్ర‌వీణ్ రెడ్డి రెబ‌ల్‌గా బ‌రిలో దిగ‌డం ఖాయ‌మే. కొత్త‌గూడెం నుంచి మాజీ ఎమ్మెల్యే కూన‌మ‌నేని సాంబ‌శివ‌రావు సీపీఐ త‌ర‌ఫున బ‌రిలో దిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అదే జ‌రిగితే కొత్త‌గూడెంలో ఇండిపెండెంట్‌ గా బ‌రిలో దిగాల‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత - మాజీ మంత్రి వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు యోచిస్తున్నారు. శేరిలింగంప‌ల్లి స్థానం టీడీపీకి ఖ‌రారైతే ఇండిపెండెంట్‌ గా బ‌రిలో దిగేందుకు హ‌స్తం నేత - మాజీ ఎమ్మెల్యే బిక్ష‌ప‌తి యాద‌వ్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ప‌లు ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ అస‌మ్మ‌తి నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకోవాల‌ని టీఆర్ ఎస్ వ్యూహం ర‌చిస్తోంది. అవ‌స‌ర‌మైతే ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌తోపాటు పార్టీలో - ప్ర‌భుత్వంలో కొన్ని ప‌ద‌వుల‌ను వారికి ఆశ‌జూపాల‌ని గులాబీ అధినాయ‌క‌త్వం భావిస్తోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. కొంద‌రు టీడీపీ నేత‌ల‌కూ ఇదే త‌ర‌హాలో వ‌ల వేసే అవ‌కాశ‌ముంద‌ని సూచిస్తున్నారు. దీంతో మ‌హా కూట‌మి సీట్ల పంప‌కం త‌ర్వాత ఏం జ‌రుగుతోందోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News