టీఆర్ ఎస్ ప్లీన‌రీ ఎందుకిలా జ‌రిగింది?

Update: 2016-04-28 06:36 GMT
స‌హ‌జంగా పార్టీ ప్లీన‌రీ స‌మావేశమంటే...గత సంవత్సరం చేసిన కార్యక్రమాలను సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్తు కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించుకు నేందుకు ప్లీనరీని నిర్వహిస్తుంటారు. కానీ తాజాగా జరిగిన టీఆర్ఎస్‌ ప్లీనరీలో అలాంటి సమీక్ష కనిపించలేదని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేసీఆర్‌ ఉపన్యాసంలో ఎక్కువగా పార్టీ నిర్మాణంపైనే దృష్టి సారించార‌ని, ఆయ‌న త‌ర‌హా జోష్ స్పీచ్ క‌నిపించ‌లేద‌ని అంటున్నారు. నాయకుల కంటే కార్యకర్తలే పార్టీకి ఆధారం అన్నట్టుగా మాట్లాడటం చూస్తుంటే.. ఇటీవల పార్టీలోకి వస్తున్న నాయకులను దృష్టిలో ఉంచుకొని ఈ రకంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. విధేయత ఉన్నవారికే పదవులు వస్తాయని చెప్పడమంటే, వెయిట్‌ చేయాలని పరోక్షంగా ప్రస్తావించినట్టుగా ఉందని అంటున్నారు. మే నెలలోనే పదవుల పంపిణీని పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత వెయిట్‌ చేయాలని చెప్పడంతో కార్యకర్తల్లో నిరాశ ఎదురైంది.

మ‌రోవైపు కేసీఆర్‌ ఉపన్యాసం తర్వాత పార్టీ పరిస్థితి గురించి మాట్లాడేందుకు పార్టీ అధ్యక్షులకు అవకాశం క‌ల్పించ‌లేదు. ఇతర పార్టీల నేతల చేరికలతో జిల్లా స్థాయిల్లో రెండేసి గ్రూపులు ఏర్పడ్డాయని, దాంతోనే మాట్లాడేందుకు జిల్లా అధ్యక్షులకు అవకాశం ఇవ్వలేదని చెప్తున్నారు. గ్రూపులు వివాదాలు బయటపడకపోయినా లోలోన నేతలు మాత్రం గుర్రుగానే ఉన్న సంగ‌తి తెలిసే ఈ విధంగా చేశార‌ని అంటున్నారు. తీర్మానాల్లో ఉపన్యాసాలే ఎక్కువగా ఉన్నాయని, ఇందులో కేసీఆర్‌ ను పొగిడేందుకు మంత్రులు - ఎమ్మెల్యేలు తాపత్రయపడ‌టం క‌నిపించిందని విశ్లేషిస్తున్నారు. ప్రజలతో ఉండకుంటే అధికారం కోల్పోతామని చెప్పడం తప్ప, ప్రజల్లో ఉండే వ్యతిరేకతను వినేందుకు సీఎం కేసీఆర్‌ వినిపించుకోవడం లేదని అంటున్నారు.

ఇదిలాఉండ‌గా ప్లీనరీ ఏర్పాట్లు బాగున్నా ముంద‌స్తు ప్ర‌య‌త్నాల విష‌యంలో జాగ్ర‌త్త‌ప‌డాల్సింద‌ని టీఆర్ ఎస్ నాయ‌కులే చెప్తున్నారు.  ప్లీన‌రీ కోసం నాలుగు వేల మంది ప్రతినిధులను ఆహ్వానించారు. కార్డులు ఉన్న‌వారే స‌భ‌కు రావాల‌ని స్ప‌ష్టం చేసిన‌ప్ప‌టికీ కార్డుల జారీ ఆలస్యం కావడంతో సభకు వ‌చ్చిన‌వారు ఇబ్బందులు ప‌డ్డారు. ఇంతేకాకుండా స‌భ ప్రారంభమై నాటికి చివరి భాగం ఖాళీగా ఉండిపోయింది. ముఖ్య‌మంత్రి - మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీల‌కు ఇబ్బందికాకున్నప్ప‌టికీ ప్ర‌జాప్ర‌తినిధులు కాని వారికి తిప్ప‌లు త‌ప్ప‌లేద‌ని కార్య‌క్ర‌మానికి వెళ్లిన నేత‌లు వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News