టీఆర్ ఎస్ అంటే తాలిబ‌న్ ఆఫ్ తెలంగాణ అంట‌

Update: 2015-08-03 11:54 GMT
అస‌హ‌నం పెరిగిన‌ప్పుడు.. అగ్ర‌హం శృతి మించిన‌ప్పుడు నోటి నుంచి ఇష్టారాజ్యంగా మాట‌లు రావ‌టం మామూలే. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోకాంగ్రెస్ నేత‌లు వైఖ‌రి ఇలానే ఉంది. తెలంగాణ అధికార‌ప‌క్షం మీద కొంద‌రు టీ కాంగ్రెస్ నేత‌లు అస్స‌లు నోరువిప్ప‌కుండా ఉంటే.. మ‌రికొంద‌రు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యాఖ్య‌లు చేసేస్తున్నారు.

దూకుడు రాజ‌కీయాలు పెరిగిన త‌ర్వాత‌.. ఎంత మాట ప‌డితే అంత మాట అనేయ‌టం.. వెన‌కాముందు చూసుకోకుండా మాట్లాడేయ‌టం మామూలైంది. కానీ.. ప్ర‌జామోదంతో ఎన్నికైన ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే స‌మ‌యంలో వెనుకా ముందు చూసుకోవ‌టం మంచిది. కానీ.. అలాంటిదేమీ లేద‌న్న‌ట్లుగా మాట్లాడేయ‌టం మ‌ర్యాద‌క‌రంగా ఉండ‌దు.

ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ మాట‌లు ఇదే తీరుగా ఉన్నాయి. తెలంగాణ అధికార‌ప‌క్షంపై ఎంత కోపం ఉంటే మాత్రం.. విమ‌ర్శించే విమ‌ర్శ‌ల్లో  కాస్త వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేయ‌టం బాగోలేద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. టీఆర్ ఎస్ పార్టీపై త‌న‌కున్న అక్క‌సును ప్ర‌ద‌ర్శించే క్ర‌మంలో ఆ పార్టీని విమ‌ర్శిస్తూ.. టీఆర్ ఎస్‌.. తాలిబ‌న్ ఆఫ్ తెలంగాణ అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య చేశారు.

పూర్వ‌కాలంలో ఔరంగ‌జేబు దండ‌యాత్ర చేసిన‌ప్పుడు.. గోల్కొండ‌పై దాడి చేసి.. అనేక భ‌వ‌నాల్ని కూల్చారే కానీ.. చార్మినార్ ను వ‌దిలేశార‌ని.. కానీ.. టీఆర్ ఎస్ మంత్రులు మాత్రం దాన్ని కూడా కూల్చేస్తాన‌న‌టం ఏమాత్రం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు.

తాలిబ‌న్లు.. ఐఎస్ తీవ్ర‌వాదులు త‌మ అధిప‌త్యాన్ని నిరూపించుకునేందుకు క‌ట్ట‌డాల్ని కూల్చేస్తుంటే..తెలంగాణ‌లో కేసీఆర్ కూడా.. స‌చివాల‌యం.. చెస్ట్‌.. ఉస్మానియా ఆసుప‌త్రి భ‌వ‌నాల్ని కూలుస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. మిగిలిన విమ‌ర్శ‌ల మామూలుగానే ఉన్నా.. ఒక తీవ్ర‌వాద సంస్థ‌తో.. ఒక ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని పోల్వ‌టం స‌రికాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News