సిద్ధిపేటలో ఇదేం గెలుపు హరీశ్?

Update: 2016-04-11 05:28 GMT
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సిద్ధిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. ఊహించిన దానికి భిన్నంగా.. రిజల్ట్స్ రావటం హాట్ టాపిక్ అయ్యింది. హరీశ్ అంటే సిద్ధిపేట.. సిద్ధిపేట అంటే హరీశ్ అన్న నానుడి బలంగా వినిపిస్తూ.. పార్టీ పేరు కంటే కూడా తన పేరు మీదనే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం జరిగింది. తానే బరిలో ఉన్నట్లుగా భావించి.. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయాలని సిద్ధిపేట వాసుల్ని మంత్రి హరీశ్ పదే పదే కోరారు. హరీశ్ అంత పర్సనల్ గా తీసుకున్న సిద్ధిపేట మున్సిపాలిటీ ఫలితం ఎలా వచ్చిందన్నది చూస్తే.. కాస్త ఆశ్చర్యపోవాల్సిందే.

మొత్తం 34 వార్డులున్న సిద్ధిపేట మున్సిపాలిటీలో టీఆర్ ఎస్ 16 స్థానాల్ని సొంతం చేసుకుంది. పోలింగ్ కు ముందే మరో 6 స్థానాల్లో ఏకగ్రీవం చేసుకుంది. ఈ లెక్కన 22 స్థానాల్లో టీఆర్ ఎస్ విజయం సాధించినట్లైంది. ఇక.. మిగిలిన 12 స్థానాల విషయానికి వస్తే.. స్వతంత్రులు ఏడు స్థానాల్లో.. కాంగ్రెస్ 2.. బీజేపీ 2.. మజ్లిస్ 1 వార్డులో విజయం సాధించింది. సాంకేతికంగా చూస్తే.. టీఆర్ ఎస్ భారీ విజయం సాధించినట్లు కనిపించినా.. గ్రేటర్ ఎన్నికలతో పోల్చి చూసినా.. హరీశ్ ఛరిష్మాతో సిద్ధిపేట ఫలితాన్ని చూస్తే.. టీఆర్ ఎస్ విజయం ఒక విజయంగా అనిపించదు. అన్నింటి మించి 34 వార్డులకు 34 వార్డుల్లో గులాబీ జెండా ఎగురుతుందని పదే పదే చెప్పిన హరీశ్ కు తాజా ఫలితాలు మింగుడు పడనివిధంగా ఉంటాయనటంలో సందేహం లేదు. అంతేకాదు.. ఈ ఫలితాలు చేసిన వారు ఎవరైనా సరే.. ‘‘ఇదేం గెలుపు హరీశ్’’ అనటం ఖాయం.
Tags:    

Similar News