ఒమర్‌ సొంత సోదరుడ్ని పెళ్లి చేసుకుంది ... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌ !

Update: 2020-10-17 12:10 GMT
అమెరికాలో ఎన్నికల వేడి రోజురోజుకి పెరిగిపోతుంది. ఎలాగైనా మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి వైట్ హౌస్ లో అడుగుపెట్టాలని డోనాల్డ్ ట్రంప్ తహతహలాడుతున్నాడు. ఈ క్రమంలోనే కరోనా భారిన పడినప్పటికీ కూడా , త్వరగా కోలుకొని మళ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. దీనికి ప్రధాన కారణం మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని తపనే. ఈ తరుణంలోనే కొన్ని కొన్ని సార్లు ప్రత్యర్థి పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా మిన్నిసోటా డెమొక్రాటిక్ పార్టీ‌ అభ్యర్థి ఇల్హాన్‌‌ అబ్దుల్లాహీ ఒమర్ ‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఒమర్‌ సొంత సోదరుడ్ని పెళ్లి చేసుకుందని, చట్ట విరుద్ధంగా అమెరికాలోకి అడుగుపెట్టిందని ఆరోపణలు చేశారు. ఒమర్‌ పై అమెరికా న్యాయ వ్యవస్థ విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ర్యాలీలో భాగంగా ట్రంప్‌ ఒకాలా, ఫ్లోరిడాలో పర్యటించారు. తన ప్రత్యర్థి సోమాలియాలో పుట్టిందని, ఈ కారణంగా మిన్నిసోటాలో తన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆమె మన దేశాన్ని ద్వేషిస్తుంది. అసలు ప్రభుత్వమే లేని దేశం నుంచి వచ్చి, మన దేశాన్ని ఎలా నడపాలో మనకు నేర్పుతుందా.. తను నిజంగా ఓ అద్భుతమైన మహిళ అంటూ ఆమె పై సెటైర్లు వేశారు.

కాగా, అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌ క్యాంపెయిన్‌ ఖాతాను ట్విటర్‌ గత గురువారం కొద్దిసేపు బ్లాక్‌ చేసిన సంగతి తెలిసిందే. డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్‌ కుమారుడిపై ట్రంప్‌ బృందం ఓ వీడియాను పోస్ట్‌ చేయగా అది నిబంధనలకు విరుద్ధమని ట్విటర్‌ టీమ్‌ ట్రంప్‌ ఖాతాను‌ తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ట్విటర్‌ తీరుపై రిపబ్లికన్‌ సభ్యులు మండిపడ్డారు.
Tags:    

Similar News