కరోనాపై ట్రంప్ నిర్లక్ష్యం...మాటల్లో చెప్పలేనిదే!

Update: 2020-05-01 01:30 GMT
ప్రపంచ దేశాలను వణికించేస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారితో అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోందంటే అతిశయోక్తి కాదేమో. రోజుకు వేల సంఖ్యలో కొత్తగా పాజిటివ్ కేసులు వస్తుంటే... వెయ్యికి పైగా జనం ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికా వాణిజ్య రాజధానిగా పేరున్న న్యూయార్క్ లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అమెరికాలో నమోదైన కేసులు, మరణాల్లో సగం మేర న్యూయార్క్ లో నమోదైనవేనంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.

కరోనా విస్తృతి అమెరికాలో ఇంకా తగ్గనే లేదు. అయితే అప్పుడే ట్రంప్ తనదైన శైలి నిర్లక్ష్య వైఖరిని మరింతగా పెంచేశారని చెప్పాలి. వచ్చే వారం నుంచి అమెరికాలో దేశీయ ప్రయాణాలకు అనుమతి ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలను పునరుద్ధరిస్తున్నట్టు వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ తెలిపారు. అంతేకాదండోయ్...దేశంలో భారీ ర్యాలీలకు సైతం అనుమతి ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. అలాగే, వచ్చేవారం తొలిసారిగా వాషింగ్టన్ వదిలి అరిజోనా పర్యటనకు ట్రంప్ వెళ్లనున్నారట. అయితే, ఈ పర్యటనలో రాజకీయ పరమైన ఉద్దేశం లేదని, ఆర్థిక కార్యకలాపాలు బలోపేతం చేయడానికేనని ట్రంప్ పేర్కొన్నారు.

అంతటితో ట్రంప్ ఆగలేదు. త్వరలోనే ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టనున్నట్టు ట్రంప్ చెప్పారు. ఇందులో భాగంగా 25 వేల మందితో భారీ సభలు నిర్వహిస్తానని ఆయన వివరించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎంతో కీలకమైన ఒహాయో రాష్ట్రంలోనూ పర్యటిస్తానని ట్రంప్ తెలిపారు. కరోనా విషయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ మహమ్మారి దానికదే పోతుందని, వ్యాక్సిన్‌పై ఆధారపడడం లేదని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. త్వరలోనే వైరస్ నశిస్తుందని ట్రంప్ సంచలన వ్యాఖ్య చేశారు. అయితే, అప్పటి వరకు అందరూ ఓపిగ్గా ఉండాలని ఆయన సూచించారు. లాక్‌డౌన్ కారణంగా నష్టాల్లో కూరుకుపోయిన ఆర్థిక రంగం త్వరలోనే కుదుటపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News