టీఆర్టీసీ మహిళా కండక్టర్ల డ్రెస్ కోడ్ అలా కానుందా?

Update: 2019-12-02 05:17 GMT
ఇస్తే నేనే ఇవ్వాలి. ఎవరో అడిగితే నేను ఇవ్వటం ఏమిటి? వరం కానీ శాపం కానీ దేనికైనా తన పేరే ఉండాలే తప్పించి.. తనను శాసించేవారు.. తన మీద ఒత్తిడి తెచ్చే వారు ఉండకూడదన్నట్లుగా ఉంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి చూస్తే. 52 రోజుల పాటు కిందామీదా పడి పెద్ద ఎత్తున సమ్మె చేసినప్పటికీ.. పెద్దగా పట్టించుకోలేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

సమ్మె షురూ అయిన 54 రోజుల తర్వాత రాత్రి వేళ ప్రెస్ మీట్ పెట్టేసి.. ఆర్టీసీ కార్మికులు వెంటనే విధుల్లోకి హాజరు కావాలని పేర్కొనటమేకాదు.. రెండు రోజుల తర్వాత రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి కొంతమంది ఉద్యోగుల్ని ప్రగతిభవన్ కు పిలిపించింది వారి కష్టనష్టాలు తెలుసుకొని భోజనం చేద్దామని.. ఆ రోజు అన్ని విషయాలు మాట్లాడతామని చెప్పటం తెలిసిందే.

అయితే.. ఈ భేటీకి ఆర్టీసీ సంఘాల నేతలకు సంబంధం ఉండదని.. వారికి ఆహ్వానమే లేదన్న సీఎం కేసీఆర్.. తన మాటలకు తగ్గట్లే చేతల్లోనూ చేసి చూపించటం తెలిసిందే. వరాల మీద వరాల ప్రకటించిన కేసీఆర్.. గతంలో తమ దగ్గర పైసల్లేవని.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో సంస్థ ఉందన్న మాటను మరిచి పోయి.. ఆర్టీసీ ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా వరాల జల్లు కురిపించారు.

తాము ఊహించిన దానికి భిన్నంగా వరాల మోత ఎక్కించిన సీఎం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటివరకూ తెలంగాణ ఆర్టీసలో పని చేస్తున్న మహిళా కండక్టర్లను డీఎంవోలు డ్యూటీలు వేసే విషయంలో దుర్మార్గంగా వ్యవహరించేవారన్న ఆరోపణ ఉండేది. డ్యూటీల పేరుతో తమను తిప్పలు పెట్టేవారన్న మహిళా కండక్టర్ల ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.. ఇకపై మహిళా కండక్టర్లను డే డ్యూటీ మాత్రమే ఉంటుందని.. రాత్రి డ్యూటీ ఉండదని తేల్చేశారు.

దీంతో అమితమైన ఆనందానికి గురి అవుతున్న మహిళా కండక్టర్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మహిళా కండక్టర్లు అయితే మరో అడుగు ముందుకేసి.. తమ డ్రెస్ కోడ్ అయిన ఖాళీ డ్రెస్సుకు భిన్నంగా గులాబీ రంగులో డ్రెస్ మార్చుకోవాలన్న ప్రతిపాదనను తెర మీదకు తీసుకొస్తున్నారు.

సీఎం కేసీఆర్ తమ కోసం తీసుకున్న నిర్ణయంతో పోలిస్తే.. తాము తమ డ్రెస్ కలర్ ను మార్చుకోవటం పెద్ద విషయం కాదన్న వాదనను తెర మీదకు తెస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే.. టీఆర్టీసీ మహిళా కండక్టర్ల డ్రెస్ కోడ్ ఊహించని రీతిలో రంగు మారిపోతుందంటున్నారు. అదే జరిగితే కేసీఆర్ కు మించి ఆనందించే వారెవరుంటారు చెప్పండి?
Tags:    

Similar News