తులసిరెడ్డికి కాంగ్రెస్‌ తప్ప మరొకటి కనిపించలేదు

Update: 2015-04-08 04:12 GMT
రాష్ట్ర విభజనను తీవ్రంగా నిరసిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తులసిరెడ్డి పార్టీని విడిచిపెట్టి వెళ్లటం తెలిసిందే. రాష్ట్ర విభజన విషయాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకించి.. సొంత పార్టీపై విమర్శలు చేసిన అతి కొద్ది సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల్లో తులసిరెడ్డి ఒకరు.

రాయలసీమ ప్రాంతానికి చెందిన తులసిరెడ్డి సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌లో ఉన్న ఆయనకు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌ పదవిని అప్పగించారు. విభజన సమయంలో ఆ పదవికి రాజీనామా చేసిన ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పారు.

ఎన్టీఆర్‌ హయాంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన ఆయన.. ఆ తర్వాత జిల్లా పరిషత్‌ సభ్యుడిగా పని చేశారు. కడప జిల్లాకు చెందిన ఈ నేత.. చివరకు కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. అందులోనే ఉండిపోయారు. విభజన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఆయన.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో నడిచిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి కొంతకాలం పని చేశారు.

అనుకున్న విధంగా జై సమైక్యాంధ్ర పార్టీ పని తీరు లేకపోవటం.. ఏ పార్టీలోకి వెళ్లాలో అర్థం కాని నేపథ్యంలో.. తులసిరెడ్డికి చివరకు కాంగ్రెస్‌ పార్టీనే కనిపించింది. దీంతో.. ఆయన తాజాగా మరోసారి కాంగ్రెస్‌పార్టీతీర్థం పుచ్చుకున్నారు. తులసిరెడ్డి లాంటి వారి కోసమే ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌ నేతలు.. ఆయన్ని సాదరంగా ఆహ్వానించి..కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. రాజకీయంగా ఎలాంటి ఐడెంటిటీ లేని తులసి రెడ్డికి ఇప్పుడు చెప్పుకోవటానికి ఏదో ఒక పార్టీ అనేది కావాలి కదా.
Tags:    

Similar News