బ‌లం చూపిస్తున్న తుమ్మ‌ల‌!

Update: 2022-03-17 15:30 GMT
టీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న‌ ఆ పార్టీ మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు త‌న బ‌లాన్ని చూపించేందుకు సిద్ద‌మ‌య్యారా? అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తాయి. సీఎం కేసీఆర్‌కు త‌న విలువ తెలిసి వ‌చ్చేలా చేసేందుకు ఆయ‌న త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

అందుకే తాజాగా ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మానికి ఆయ‌న భారీ సంఖ్య‌లో ద్విచ‌క్ర‌వాహ‌నాలు, కార్ల‌తో ర్యాలీగా వెళ్లార‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. పైగా తుమ్మ‌ల చేసిన తాజా వ్యాఖ్య‌లు టీఆర్ఎస్‌ను ఉద్దేశించే చేశార‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

బైకులు, కార్లు
బుధ‌వారం ఖ‌మ్మం జిల్లా నేల‌కొండ‌ప‌ల్లి మండ‌లం చెరువు మాదారంలో ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మానికి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు హాజ‌ర‌య్యారు. ఖ‌మ్మంలో జిల్లాలో సీనియ‌ర్ నేత పైగా మాజీ మంత్రి కాబ‌ట్టి అత‌ని వెంట అనుచ‌రులు ఉండ‌డం సాధార‌ణ‌మే. మహా అయితే ఓ అయిదు కార్ల‌తో మంత్రి ఆ కార్య‌క్ర‌మానికి వెళ్లారంటే ఓకే. కానీ ఏకంగా 500 మంది కార్య‌క‌ర్త‌లు ద్విచ‌క్ర‌వాజహ‌నాల‌పై, మ‌రో 50కి పైగా కార్లలో ఆయ‌న అభిమానులు త‌ర‌లిరావ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

టీఆర్ఎస్‌లో త‌గిన ప్రాధాన్య‌త ల‌భించ‌డం లేద‌నే అసంతృప్తితో పార్టీ మారే యోచ‌న‌లో ఉన్న తుమ్మ‌ల త‌న బ‌లాన్ని చాటేందుకు ఇలా ర్యాలీగా వ‌చ్చార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. కేసీఆర్‌కు క‌నువిప్పు క‌ల‌గాల‌నే ఉద్దేశంతో ఆయ‌న ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మానికి వెళ్తూ ఇంత హ‌డావుడి చేశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఆ అభివృద్ధి ప‌నులు..
ఇక ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా తుమ్మ‌ల చేసిన వ్యాఖ్య‌లు కూడా తీవ్ర దుమార‌మే రేపుతున్నాయి. రాజ‌కీయ శ‌త్రువుల‌ను న‌మ్మొచ్చు కానీ ద్రోహుల్ని మాత్రం న‌మ్మ‌కూడ‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆ ద్రోహుల్లో పార్టీని ఓడించే పెద్ద‌లుంటార‌ని, వాళ్ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో తాను మంత్రిగా ఉన్న స‌మ‌యంలో పాలేరు నియోజ‌క‌వ‌ర్గానికి ఎన్నో అభివృద్ధి ప‌నులు చేశానంటూ ఆయ‌న వెల్ల‌డించారు.

మ‌రోవైపు తుమ్మ‌లో మ‌రోసారి పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాల‌ని కోరుకుంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన తుమ్మ‌ల ఓడిపోయారు. అప్పుడు ఇక్క‌డ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేంద‌ర్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్‌లోనే ఉన్నారు. దీంతో ఉపేంద‌ర్ రెడ్డి, తుమ్మ‌ల వ‌ర్గాల మ‌ధ్య విభేదాలు పెరిగాయి. ఎంతో రాజ‌కీయ అనుభ‌వం.. ఖ‌మ్మంలో ప‌లుకుబ‌డి ఉన్న త‌న‌కు కేసీఆర్ త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని తుమ్మ‌ల అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News