'మోడీ' ఎక్స్‌ ప్రెస్‌ లో వైసీపీకి బెర్తులు?

Update: 2020-02-12 15:09 GMT
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేంద్రంలో బీజేపీ....రాష్ట్రంలో వైసీపీ ఏక‌ప‌క్ష విజ‌యాలు సాధించాయి. అటు బీజేపీ...ఇటు వైసీపీ రెండూ బ‌ల‌మైన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, ఎన్నిక‌ల‌కు ముందు ఎన్డీఏలో వైసీపీ చేర‌బోతోందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. చంద్ర‌బాబుపై గుర్రుగా ఉన్న ప్ర‌ధాని మోడీ...తెర వెనుక జ‌గ‌న్‌ కు సాయం చేశార‌ని టాక్ వ‌చ్చింది. అందుకు త‌గ్గ‌ట్లుగానే ఎన్నిక‌ల్లో విజ‌యానంత‌రం మోడీతో జ‌గ‌న్ స్నేహ‌పూర్వ‌క సంబంధాలు నెరిపారు. అయితే, ఆ త‌ర్వాతి ప‌రిణామాల దృష్ట్యా....బీజేపీతో అంటీముట్ట‌న‌ట్లుగా వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ప్ర‌ధాని మోడీతో ఏపీ సీఎం జ‌గ‌న్ భేటీ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. మండ‌లి ర‌ద్దుతో పాటు కేంద్ర కేబినెట్‌ లోకి వైసీపీ రాబోతోందంటూ హ‌స్తిన‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్రధానితో గంటకు పైగా భేటీ అయిన జగ‌న్ ప‌లు అంశాల‌ను చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. మండ‌లి ర‌ద్దు అంశంతో పాటు ఎన్డీఏ కూట‌మిలో వైసీపీ చేరిక‌పై వీరిద్ద‌రూ చ‌ర్చించిన‌ట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతేకాదు,  వైసీపీకి ప్ర‌ధాని మోడీ రెండు కేబినెట్ సీట్లు ఆఫ‌ర్ చేశార‌ని తెలుస్తోంది. రాజ్యసభ కోటాలో విజయసాయిరెడ్డి - లోక్‌ సభ కోటాలో నందిగం సురేష్‌ లు కేంద్ర మంత్రుల‌య్యే చాన్స్ ఉంద‌ని టాక్ వ‌స్తోంది. ప‌రోక్షంగా త‌మ‌కు మిత్ర‌ప‌క్షంగా ఉన్న వైసీపీ కేబినెట్‌ లో చేర‌డాన్ని బీజేపీ నేత‌లు స్వాగ‌తిస్తున్నార‌ట‌. ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకోవాల‌నే కాన్సెప్ట్‌ లో బీజేపీ నేత‌లున్నార‌ట‌. మండ‌లిలో వైసీపీ బ‌ల‌హీనంగా ఉన్న త‌ర‌హాలోనే రాజ్య‌స‌భ‌లో బ‌లం లేని బీజేపీ....వైసీపీ స‌హ‌కారం కోరుకుంటోంద‌ట‌. అయితే, ఎన్డీఏలో తాము భాగ‌స్వాములం కావ‌డం లేదంటూ విజ‌య‌సాయిరెడ్డి ఆ ప్ర‌చారాన్ని ఖండించారు. మ‌రి, `మోడీ` ఎక్స్‌ ప్రెస్‌ లో వైసీపీకి బెర్తులు ద‌క్కుతాయో లేదో తెలియాలంటే మ‌రికొంత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు



Tags:    

Similar News