రెండూ తెలంగాణలోనే.. భార్యను చంపిన భర్త.. తల్లిపై కొడుకు హత్యాయత్నం

Update: 2019-11-22 05:06 GMT
మానవత్వం మంటగలవటం లాంటి మాటలు అస్సలు పనికి రావు. బంధానికి.. అనుబంధానికి ఇవాల్టి రోజున ఏమీ లేదన్న భావన కలిగేలా.. కనీస కనికరం లేని రీతిలో పాల్పడ్డ రెండు కిరాతక ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. ఈ రెండు ఉదంతాలు వింటే.. ఏ రిలేషన్ ను నమ్మలేని దుస్థితికి గురి కావటం ఖాయం.

కుమరం భీమ్ జిల్లా కాగజ్ నగర్ లో తల్లిని కత్తితో పొడిచేసి తీవ్రంగా గాయపర్చిన కొడుకు నిర్వాకమిది. సంధ్యారాణి అంగన్ వాడీ ఆయాగా పని చేస్తోంది. ఆమె భర్త పదేళ్ల క్రితమే మరణించారు. దీంతో కుటుంబానికి అన్నీ తానై పోషిస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు ఇటీవలే పెళ్లి చేసిన సంధ్యా రాణికి మరో కొడుకు ఉన్నాడు. అతగాడి పేరు ప్రశాంత్. పాతికేళ్లు. చదువు లేకుండా బాధ్యతగా వ్యవహరించకుండా జులాయిగా తిరిగే అతనికి మద్యం అలవాటు తోడైంది.

మద్యానికి తోడుగా గంజాయికి బానిసైన అతడు.. డబ్బు కోసం తల్లిని తరచూ వేధించేవాడు. గొడవపడేవాడు. తల్లికి వచ్చే వితంతు పింఛన్ తనకు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. అయితే.. అతను కోరినట్లు ఇంతకాలం డబ్బులు ఇచ్చిన ఆమె.. నో చెప్పింది. దీంతో కక్ష పెంచుకున్న అతడు..తల్లి నిద్రిస్తున్న సమయంలో కత్తితో ఆమె గొంతు కోసేశాడు. అనంతరం కత్తితో పొడిచేశాడు. ఆమె కేకలకు చుట్టుపక్కల జనం పరిగెత్తుకొచ్చారు.

అప్పటికే ఉన్మాదంలో ఉన్న ప్రశాంత్.. చంపేశాను.. వెళ్లి చూసుకోండంటూ గట్టి గట్టిగా అరుస్తూ పారిపోయాడు. స్థానికులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు.
మరో ఉదంతాన్ని చూస్తే.. వరంగల్ జిల్లాలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దారుణం చోటు చేసుకుంది. తన భార్య సూసైడ్ చేసుకుందంటూ సోమేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అతని సమాచారం ఆధారంగా ఇంటికి వెళ్లిన వారికి అతడి భార్య డెడ్ బాడీని చూసిన పోలీసులు సందేహంతో ప్రశ్నలు వేయటంతో తడబడ్డాడు.

దీంతో తమదైన శైలిలో విచారణ చేయటంతో తాను చేసిన ఘోరాన్ని చెప్పుకొచ్చాడు. రాయపర్తి మండలం పరిధిలోని రేగేళ్ల తండాకు చెందిన సోమేశ్వర్ భార్య శారద. వారికి ఇద్దరు పిల్లలు. సోమేశ్వర్ ఒక కంపెనీలో వెల్డర్ గా పని చేస్తుంటే.. శారద మరో కంపెనీలో పని చేస్తోంది. పిల్లలు గురుకుల పాఠశాలలో చదివిస్తున్నారు. చక్కగా సాగుతున్న వారి కుటుంబంలో సోమేశ్వర్ కు మద్యం అలవాటు మొదలైంది. అది కాస్తా వ్యసనంగా మారింది.

వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా తగలేయటంతో కలతలు మొదలయ్యాయి. భార్య..భర్తల మధ్య నిత్యం గొడవలు సాగటమే కాదు.. తీవ్రత పెరిగింది. కంపెనీ నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చిన ఆమెను అనుమానించటంతో తట్టుకోలేకపోయింది. తాగి డబ్బులు తగలేయటమే కాదు..అనుమానిస్తావా? అంటూ నిలదీసింది.

దీంతో గొడవ పెరిగి.. ఉన్మాదంతో బాత్రూంలోకి తోసేశాడు. తలకు బలమైన గాయం తగలటంతో అక్కడికక్కడే మరణించింది. ఏం చేయాలో తోచని సోమేశ్వర్.. రాత్రి నుంచి తర్వాతి రోజు సాయంత్రం వరకూ ఇంట్లోనే డెడ్ బాడీని ఉంచేశాడు. అక్కడే పడుకున్నాడు. తర్వాత.. పోలీసుల వద్దకు వచ్చి తన భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకమాడాడు. అనుమానంతో క్రాస్ చెక్ చేసిన పోలీసులకు అసలు విషయం బయటకు వచ్చేలా చేశారు.
Tags:    

Similar News