పవన్ కళ్యాణ్ పై ఆ నేత తీవ్ర వ్యాఖ్యలు

Update: 2016-07-21 13:17 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటే జనాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. చాలామందిలో ఆశలు కూడా రేగాయి. వారి ఆశలు.. ఆకాంక్షలకు తగ్గట్లే ‘జనసేన’ ఆవిర్భావ సభలో పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చాడు పవన్. కానీ ఆ తర్వాత అంచనాలకు తగ్గట్లుగా పని చేయలేకపోయాడు. ఎన్నికల్లో పోటీ లేదు. పార్టీ నిర్మాణమే జరగలేదు. గత రెండేళ్లలో అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన కార్యకలాపాలే లేవు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీనే రద్దు చేయాలంటూ గట్టి డిమాండ్ వినిపిస్తుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉదయ్ కిరణ్.. పవన్ కళ్యాన్ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. ఎందుకూ కొరగాకుండా ఉన్న ‘జనసేన’ పార్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సొంత భార్యాపిల్లలకే న్యాయం చేయలేని వాడు.. ప్రజలకు ఏం చేస్తాడంటూ ఉదయ్ కిరణ్ పవన్ ను విమర్శించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఎందుకు పోరాటం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని.. ప్రభుత్వ పథకాల్ని దుర్వినియోగం చేస్తున్నారని.. కానీ పవన్ వీటి మీద ఏమాత్రం స్పందించడం లేదని.. ఆయన ఓ రాజకీయ పార్టీ అధినేతగా ఉండి ఏం ప్రయోజనమని.. అందుకే ‘జనసేన’ పార్టీని రద్దు చేసేయాలని ఉదయ్ కిరణ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ ఎందుకు మౌనంగా ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు. మరి ఇంకో రెండేళ్లలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగపెట్టాలని భావిస్తున్న పవన్.. ఈ విమర్శలపై స్పందిస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News