మొబైల్లో ఆధార్ క‌ల‌క‌లం..షాక్ లో దేశ ప్ర‌జ‌లు!

Update: 2018-08-04 04:54 GMT
ఆధార్ గోప్య‌త మీదా.. దాని భ‌ద్ర‌త మీద గ‌డిచిన కొంత‌కాలంగా సందేహాలు ఉండ‌టం ఒక ఎత్తు అయితే.. నిన్న‌టి (శుక్ర‌వారం)  నుంచి దేశంలోని 80 శాతం మొబైల్ ఫోన్ల‌లో  ఆధార్ టోల్ ఫ్రీ నెంబ‌ర్ అయిన 18003001947 నంబ‌ర్ ఆటోమేటిక్ గా సేవ్ అయిన వైనం ఇప్పుడు గ‌గ్గోలుగా మారింది.

మామూలుగా అయితే.. సేవ్ చేసుకోకుండా ఏ నెంబ‌ర్ సేవ్ కాదు. కాకుంటే.. సిమ్ కార్డు కొత్త‌ది వేసుకున్న‌ప్పుడు ఆయా నెట్ వ‌ర్క్ ల‌కు సంబంధించిన నెంబ‌ర్లు సేవ్ అవుతాయి. అది కాకుండా.. మ‌రే నెంబ‌ర్ సేవ్ కాదు. దీనికి భిన్నంగా ఆధార్ నెంబ‌ర్ ఆటోమేటిక్ గా సేవ్ కావ‌టం గ‌గ్గోలు పెట్టేలా చేసింది. గూగుల్‌ కు చెందిన ఆండ్రాయిడ్ ఫోన్ల‌లోనే కాదు.. అత్యంత సుర‌క్షితంగా భావించే  ఐఫోన్ల‌లోనూ ఆధార్ టోల్ ఫ్రీ నెంబ‌ర్ ఆటోమేటిక్ గా సేవ్ కావ‌టంతో ఆధార్ భ‌ద్ర‌త మీద దేశ వ్యాప్తంగా చ‌ర్చ మొద‌లు కావ‌ట‌మే కాదు.. ఇప్పుడు వ‌ణికేలా చేస్తోంది.

అయితే.. ఇదంతా కేంద్రం కానీ.. మ‌రే రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన సంస్థ ఆదేశాల‌తో ఇలా జ‌ర‌గ‌క‌పోవ‌ట‌మే అస‌లు స‌మ‌స్యంతా. ఇంత‌కీ.. మ‌న ఫోన్లోకి ఆధార్ టోల్ ఫ్రీ నెంబ‌ర్ మ‌న‌కు తెలీకుండానే ఎలా సేవ్ అయ్యింద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలిస్తే.. ఒక్క‌సారి వ‌ణ‌క‌ట‌మే కాదు.. ఎంతో గొప్ప‌గా చెప్పుకునే ఆధార్ భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌లోని డొల్ల‌త‌నం కొట్టొచ్చిన‌ట్లుగా క‌న‌ప‌డ‌క మాన‌దు.

భార‌త్ లోని 80 శాతం ఫోన్ల‌లో ఆటోమేటిక్ గా సేవ్ అయిన ఆధార్ టోల్ ఫ్రీ నెంబ‌ర్ వ్య‌వ‌హారాన్ని  ఫ్రాన్స్ కు చెందిన ఎథిక‌ల్ హ్యాక‌ర్ ఇలియ‌ట్ ఆల్ర్స‌న్ ప్ర‌శ్నలు సంధిస్తూ వ‌రుస ట్వీట్లు చేశారు. అంతేకాదు.. ఆధార్ డేటాబేస్ ఎంత మాత్రం భ‌ద్రం కాద‌ని తేల్చి చెప్పారు. ఆధార్ భ‌ద్ర‌త‌పై సందేహాలు వెల్లువెత్తుతున్న వేళ‌.. కొత్త భ‌యాన్ని క‌లిగిస్తూ  చోటు చేసుకున్న ప‌రిణామం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

ఓప‌క్క ఆధార్ అత్యంత సుర‌క్షిత‌మైన‌ద‌న్న మాట చెబుతున్న వేళ‌.. ఇలాంటి ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టంపై గంద‌ర‌గోళం వ్య‌క్త‌మైంది. త‌మ అజాగ్ర‌త్త వ‌ల్లే ఈ నంబ‌ర్ ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ కోడింగ్‌లో ఉన్న‌దంటూ గూగుల్ క్ష‌మాప‌ణ‌లుచెప్పింది.  2014లో చేసిన కోడింగ్ అని.. ఆధార్ టోల్ ఫ్రీ నెంబ‌ర్ తో పాటు.. 112 హెల్ప్ లైన్ నంబ‌రును కూడా అందులో చేర్చామ‌ని.. అప్ప‌టి నుంచి ఇలానే సాగుతుంద‌ని పేర్కొంది.

ఈ నంబ‌ర్ ను మాన్యువ‌ల్ గా డిలీట్ చేసుకోవ‌చ్చ‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కోడింగ్ లో దొర్లిన త‌ప్పును అదే కోడింగ్ తో స‌రి చేస్తూ.. నెంబ‌ర్ అదృశ్య‌మ‌య్యేలా చేయొచ్చు క‌దా? అన్న ప‌లువురి సందేహాల‌కు స‌మాధానం దొర‌క‌ని ప‌రిస్థితి. సాంకేతికంగా ఇలాంటివి సాధ్యం కాద‌న్న వాద‌న‌కు చెక్ చెబుతూ.. మ‌రి.. మా అనుమ‌తి లేకుండా ఫోన్ల‌లోకి ఎలా వ‌చ్చేసింద‌న్న ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నాయి.

గూగుల్ ప్ర‌క‌ట‌నకు ముందు ఆధార్ ప్రాధికార సంస్థ ఫోన్ల‌లో నెంబ‌ర్ ఆటోమేటిక్ గా సేవ్ కావ‌టంపై స్పందిస్తూ.. కొన్ని స్వార్థ‌పూరిత శ‌క్తులు ఉద్దేశ‌పూర్వ‌కంగానే కాంటాక్ట్ లిస్ట్ లో చేరాయ‌ని పేర్కొన్నారు. 18003001947 నంబ‌రు చెల్లుబాటులో లేద‌ని.. త‌మ టోల్ ఫ్రీ నెంబ‌రు 1947 అని మాత్ర‌మే పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఆధార్ భ‌ద్ర‌త‌పై శుక్ర‌వారం రాజ్య‌స‌భ‌లో ప‌లువురు ఎంపీలు కేంద్రాన్ని నిల‌దీశారు. దీనిపై బ‌దులిచ్చిన కేంద్ర ఐటీ శాఖామంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌.. ఇప్ప‌టివ‌ర‌కూ యూఐడీఎఏఐ డేటాబేస్ ను దుర్వినియోగం చేసిన‌ట్లుగా ఎలాంటి ఉదంతాలు త‌మ దృష్టికి .రాలేద‌న్నారు. ఆధార్ ఆధారంగా రూ.90వేల కోట్ల లావాదేవీలు జ‌రుగుతున్న‌ట్లుగా పేర్కొన్నారు. ఇంత భారీగా లావాదేవీలు జ‌ర‌గ‌టం.. ఆధార్ ప్ర‌తి ఒక్క భార‌తీయుడి జీవితంలోనూ కీల‌కం కావ‌ట‌మే ఇప్పుడున్న అతి పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News