గురి పెట్టి మరీ జనరళ్లను లేపేస్తున్న ఉక్రెయిన్ సేనలు

Update: 2022-03-28 03:56 GMT
చూస్తుండగానే ఉక్రెయిన్ - రష్యా మధ్య సాగుతున్న యుద్ధం నెల దాటేసింది. యుద్ధాన్ని షురూ చేసిన వేళ.. ఇంత సుదీర్ఘంగా యుద్ధం జరుగుతుందని అస్సలు ఊహించింది లేదు. ఉక్రెయిన్ మీద రష్యా పట్టు సాధిస్తోందని.. తన వశం చేసుకోవటానికి పెద్ద సమయం పట్టదన్న మాట వినిపిస్తున్న వేళలోనే.. రష్యాకు ఉక్రెయిన్ సైన్యం చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదంటున్నారు. తాజాగా జరుగుతున్న యుద్ధంలో రష్యన్ జనరళ్లను లక్ష్యంగా చేసుకొని వారిని లేపేస్తున్నారు. ప్రత్యర్థుల నాయకత్వాన్ని నిర్వీర్యం చేసేలా సాగుతున్న ఈ యుద్ధం కారణంగా రష్యాకు చెందిన జనరళ్లు పెద్ద ఎత్తున మరణిస్తున్నారు. దీంతో.. రష్యా సైనిక దళాల ఆత్మస్తైర్యం భారీగా దెబ్బ తింటున్న పరిస్థితి.

తాజాగా చూస్తే.. రష్యా ఏడో జనరల్ ను కోల్పోయినట్లుగా పశ్చిమ దేశాల సైనిక వర్గాలు వెల్లడించాయి. అయితే.. రష్యా మాత్రం ఆ విషయాన్ని ఖరారు చేయటం లేదు. ఇదిలా ఉంటే.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో జనరళ్లు మృత్యువాత పడటం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. సుదీర్ఘంగా సాగిన చెచెన్యా యుద్ధంలో సైతం ఈ స్థాయిలో సైనిక జనరళ్లు మరణించటం లేదు. అన్ని దశల్లో కలిపి 15 మంది రష్యా ఆర్మీ కమాండర్లు మరణించినట్లుగా ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడిస్తే.. క్రెమ్లిన్ వర్గాలు మాత్రం తాము ఒక్క సీనియర్ అధికారిని మాత్రమే కోల్పోయినట్లుగా పేర్కొంటోంది.

రష్యా దూకుడును దెబ్బ తీసేందుకు వీలుగా ఈ తరహా వ్యూహాన్ని ఉక్రెయిన్ అమలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కమాండర్లను లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళుతున్నారని.. రష్యా దళాల నైతికస్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నట్లుగా చెప్పాలి. దీనికి తోడు రష్యన్ జనరళ్లు సైతం నేరుగా యుద్ధంలోకి రావటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. సాధారణంగా జనరళ్ల ఎంట్రీ చాలా అరుదుగా ఉంటుంది. యుద్దంలో నేరుగా వారు పాలు పంచుకోవటం తక్కువని.. అందుకు పదేళ్లు పాటు వియత్నాంతో అమెరికా చేసిన యుద్దాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఆ యుద్ధంలో కేవలం 12 మంది అమెరికన్ జనరళ్లు మరణించారని.. ఈ లెక్కన ఉక్రెయిన్ తో యుద్ధం వేళ రష్యన్ జనరళ్లు పెద్ద ఎత్తున మరణించటం చూస్తే.. ఇప్పుడు జరుగుతున్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చంటున్నారు. తమను ఆక్రమించాలని చూస్తున్న రష్యన్ దళాల ఆయువు పట్టుపై దెబ్బ తీసేలా ఉక్రెయిన్ సేనలు యుద్ధం చేస్తున్నాయి. రష్యా కమాండ్ అండ్ కంట్రోల్ పోస్టులపై దాడులు చేస్తున్నాయి.

రష్యన్ సైనిక అధికార క్రమం ఎలా ఉంటుందన్న దానిపై అవగాహన ఉన్న ఉక్రెయిన్.. ఆదేశాలు ఇచ్చే వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. దీంతో.. సైన్యాన్ని నడిపించే నాయకత్వం కరవై.. రష్యా అనుకున్న లక్ష్యం అంతకంతకూ ఆలస్యమవుతున్న పరిస్థితి. దీనికి తోడు రష్యన్ సైన్యంలోని ప్రాధాన్యత పోస్టులను.. తనకు అనుకూలమైన వారిని ఎంపిక చేసుకోవటమే తప్పించి.. సమర్థతను పట్టించుకోని పుతిన్ పుణ్యమా అని రష్యా సైనిక బలగాలకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

రష్యా సైన్యానికి.. ఉక్రెయిన్ సైన్యానికి మధ్య స్థాయి అంతరం ఎక్కువనే మాట వినిపిస్తోంది. ఉక్రెయిన్ సేనలతో పోలిస్తే.. రష్యన్ సైనికులు తక్కువ జీతాలకు పని చేస్తుంటారని చెబుతున్నారు. దీనికి తోడు పేలవమైన సైనిక శిక్షణ కూడా రష్యా కొంప ముంచేలా మారిందంటున్నారు. ఒక అంచనా ప్రకారం రష్యన్ సైన్యంలో జూనియర్ ర్యాంకు అధికారికి 480 డాలర్ల వేతనం లభిస్తుండగా.. ఉక్రెయిన్ సైన్యంలోని అదే స్థాయి అధికారికి మూడు రెట్లు అధికంగా జీతం లభిస్తుందని చెబుతున్నారు.

ఇలాంటి అంశాలు కూడా ఉక్రెయిన్ మీద పోరాడే తత్వ్తాన్ని దెబ్బ తీస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా రష్యన్ 49వ కంబైన్డ్ ఆర్మీకి చెందిన కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రెజాంట్సేవ్ మరణించారు. ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైన నాటి నుంచి మరణించిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల్లో ఆయన రెండోవారు. ఇలాంటి ఎదురు దెబ్బల్ని రష్యా అస్సలు అంచనా వేయలేకపోయిందని చెబుతున్నారు.
Tags:    

Similar News