మోడీకి ఉమాభారతి అలా షాకిచ్చారా?

Update: 2016-05-03 09:20 GMT
ఏపీకి ప్రత్యేక హోదా నై అంటూ కేంద్రసహాయ మంత్రి చౌదరి చేసిన వ్యాఖ్యలు ఎంతటి వేడిని పుట్టించాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. చౌదరి చేసిన వ్యాఖ్యలతో ఏపీలోని అధికార.. విపక్షాలు భగ్గుమన్నాయి. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ సర్కారు ఇస్తున్న షాకుల్ని ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కాక చంద్రబాబు సర్కారు కిందామీదా పడుతున్న పరిస్థితి. దానికి తగ్గట్లే.. సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బాబు మాటల్ని చూస్తే.. తాజా పరిస్థితి పట్ల ఆయనెంత ఇబ్బందికి గురి అవుతున్నారన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.  

ఇదిలా ఉంటే.. తాజగా మరో కేంద్రమంత్రి ఏపీకి సంబంధించిన అంశంపై వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. అయితే.. కేంద్ర మంత్రి చౌదరి మాదిరి కాకుండా.. తాజాగా సదరు కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు మోడీ వైపు వేలెత్తి చూపించేలా ఉండటం గమనార్హం. ఏపీ ఇబ్బందుల్ని కేంద్రం అస్సలు పట్టించుకోవటం లేదన్న విమర్శల నేపథ్యంలో.. ఏపీ తరఫున వకల్తా పుచ్చుకున్నట్లుగా కేంద్రమంత్రి ఉమాభారతి తాజా చర్య ఉందటం గమనార్హం.  ప్రధాని నరేంద్ర మోడీకి ఆమె ఓ లేఖ రాశారు.

ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఉమాభారతి.. ఆ ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నిధులను కేంద్రమే విడుదల చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. పలు అంశాల్ని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి అవసరమైన నిధుల్ని కేంద్రమే విడుదల చేయాలన్న విషయాన్ని ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఏపీకి సంబంధించిన వ్యవహారాలపై కేంద్రమంత్రులు చేసే వ్యాఖ్యలు బాబు సర్కారుకు షాకింగ్ గా మారితే.. తాజాగా కేంద్రమంత్రి ఉమాభారతి లేఖ.. ప్రధాని మోడీకి షాక్ ఇచ్చినట్లుగా చెప్పొచ్చు. మరి.. దీనిపై ప్రధాని స్పందిస్తారా? పట్టనట్లు మౌనంగా ఉండిపోతారా?
Tags:    

Similar News