పైసలు ఇవ్వరు కానీ పోలవరాన్ని పూర్తి చేస్తారట

Update: 2016-03-01 18:48 GMT
కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టే వార్షిక బడ్జెట్ లో ఏపీకి మొండి చేయి చూపించటం.. ఇచ్చిన హామీల అమలుకు ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండటం ఒక అలవాటుగా మారింది. బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకు రూ.వంద కోట్లు కేటాయించి.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై నీలినీడల్ని ప్రసరించేలా ఆర్థికమంత్రి జైట్లీ చేస్తే.. అందుకు భిన్నంగా కవరింగ్ సంభాషణలు షురూ చేశారు కేంద్రమంత్రి ఉమాభారతి.

మోడీ సర్కారుకు చెందిన కీలకనేతలంతా ఈ మధ్యన కొన్ని పడిగట్టు పదాలతో కూడిన వ్యాఖ్యలు చేయటం ఒక అలవాటుగా మార్చుకున్నారు. చేతల్లో చేయకున్నా.. మాటలకు మాత్రం ఏ మాత్రం తక్కువ లేదన్నట్లుగా వ్యవహరించటం ఈ మధ్యన ఎక్కువైంది. నిన్నటికి నిన్న జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్ల రూపాయిల ముష్టి వేసిన కేంద్రసర్కారు తీరును సమర్థిస్తూ.. కేంద్రమంత్రి ఉమాభారతి వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

మొదటి నుంచి చెబుతున్నట్లే.. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని ఆమె నమ్మబలుకున్నారు. నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతున్న కేంద్రమంత్రి.. బడ్జెట్ లో మాత్రం రూ.100కోట్లే ఎందుకు ప్రకటించినట్లు? నిజానికి.. ఇప్పుడు ప్రకటించినట్లుగా ఎన్నో వందల కోట్లు కలిపితే కానీ.. వేలాది కోట్లు అవసరమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి కాని పరిస్థితి.

కానీ.. ఆ విషయాన్ని ఏమాత్రం ప్రస్తావించని ఉమాభారతి.. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తానని నమ్మకంగా చెప్పటం చూస్తే.. ఏపీకి హ్యాండ్ ఇవ్వటానికి మోడీ అండ్ కో మ్యాప్ వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పక తప్పదు. అసలు ఇన్ని మాటలు ఎందుకు.. ప్రాజెక్టు వడివడిగా పూర్తి అయ్యేలా భారీగా నిధులు ప్రకటిస్తే సరిపోయేది కదా..? అలాంటిదేమీ చేయకుండా ఊకదంపుడు మాటలెందుకు..?
Tags:    

Similar News