ఐరాస అనూహ్య నిర్ణయం...ఆ జాబితా నుంచి తాలిబన్ తొలగింపు !

Update: 2021-08-30 05:31 GMT
ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత దేశంలో అనేక రకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉగ్రవాదుల దాడులు పెచ్చరిల్లాయి. వరుసగా సంభవించిన జంట పేలుళ్లు 200 మందికి పైగా ఆఫ్ఘనిస్తానీయులను బలి తీసుకున్నాయి. ఏ ప్రాణాంతక ఉగ్రదాడులు జరక్కూడదని ప్రపంచ దేశాలు ఆశించాయో, అదే తరహా ఆత్మాహూతి దాడులు అక్కడ చోటు చేసుకున్నాయి. ఈ జంట పేలుళ్లతో ఉగ్రవాదుల దాడులు నిలిచిపోయేవి కావు అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా హెచ్చరించారు. ఈ పరిణామాల మధ్య, ఆప్ఘనిస్తాన్‌ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతోన్న తాలిబన్లపై ఐక్యరాజ్య సమితి భద్రత మండలి వైఖరి మారినట్టుగా కనిపిస్తోంది.

ఉగ్రవాదంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విడుదల చేసిన ఓ ప్రకటనలో తాలిబన్లను ఆ జాబితా నుంచి తప్పించడం చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఆగస్టు నెలకు భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తోన్న భారత్.. ఆ హోదాలో ఉత్తర్వులపై సంతకం చేసింది. అంతకు ముందు తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించిన మర్నాడే ఆగస్టు 16న ఐరాస ఇటువంటి ప్రకటనే విడుదల చేసింది. ఆ ప్రకటనలో తాలిబన్‌, ఇతర అఫ్గన్‌ గ్రూపులు లేదా వ్యక్తులు అని స్పష్టంగా ఉంది. ఈ రెండు ప్రకటనల్లో మార్పును గతలంలో ఐరాసలో భారత రాయబారిగా పనిచేసిన సయ్యద్‌ అక్బరుద్దీన్‌ బయటపెట్టారు.

దౌత్యంలో రెండు వారాలనేది చాలా ఎక్కువ సమయం. టి అనే పదం మాయమైపోయింది. ఆగస్టు 16,27 తేదీల్లో విడుదలైన ఐరాస ప్రకటనల్లో నేను మార్క్‌ చేసిన చోట చూడండి అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. రెండు ప్రకటనలను ట్వీట్‌ కు జత చేశారు. ప్రస్తుతం అక్బరుద్దీన్‌ కౌటీల్యా స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ డీన్‌ గా పనిచేస్తున్నారు. ‘అర్ధవంతమైన చర్యల ద్వారా అఫ్గన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. అన్ని వర్గాలకూ ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలను కూడా ప్రభుత్వం భాగస్వాములను చేసిన వారి హక్కులను పరిరక్షించాలి. తక్షణమే హింసను వదలిపెట్టి ప్రస్తుత సంక్షోభం నివారణకు ప్రయత్నించాలి. అంతర్జాతీయ న్యాయచట్టాలు, మానవహక్కులను పరిరక్షించాలి.. అఫ్గన్‌లోని విదేశీయుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి. అఫ్గన్‌ లోని శాంతి స్థాపనకు అంతర్జాతీయ సమాజం కూడా సహకరించాలి’ ఆగస్టు 16న విడుదల చేసిన ప్రకటనలో ఐరాస పేర్కొంది.

ఇదివరకు ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరైన విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ ను తాలిబన్ల ప్రభుత్వం గురించి ప్రస్తావించగా, ఆయన దాట వేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోన్న తాలిబన్ల గురించి ఇప్పుడే మాట్లాడటం, ఒక అభిప్రాయానికి రావడం తొందరపడినట్టవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ దృష్టి మొత్తం ఆప్ఘనిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంపై ఉందని అన్నారు. అదే సమయంలో  తాలిబన్లు భారత్‌ కు అనుకూలంగా ఓ ప్రకటన చేశారు. భారత ప్రాజెక్టులను తాము అడ్డుకోవాలని భావించట్లేదని స్పష్టం చేసింది
Tags:    

Similar News