ఉండవల్లి అరుణ్ కుమార్ మాటతీరు గురించి బాగా తెలిసినవారు ఓ మాట చెప్తుంటారు.. ఆయన కాదంటే ఒక్కోసారి అవుననే అర్ధమని చెప్తారు. అంతెందుకు.. ‘‘రామోజీరావుగారా.. ఆయన చాలా పెద్దోళ్లండీ’’ అంటారు ఉండవల్లి. కానీ, రామోజీని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిందీ ఆయనే. చంద్రబాబు విషయంలోనూ అంతే... చంద్రబాబు తెలివైన పొలిటీషియన్ అని ఉండవల్లి అనేక సందర్భాల్లో ఒప్పుకొంటారు, కానీ.. అదే చంద్రబాబుకు చుక్కలు చూపించే స్కెచ్ వేస్తుంటారు. తాజాగా.. ఆయన ఇలాంటిదే ఇంకో మాట చెప్పారు. పవన్ - జగన్ లను కలిపే ప్రయత్నం తాను చేయడంలేదని.. అంత సామర్థ్యం తనకు లేదని ఆయన అన్నారు. దీంతో... చాలామందిలో కొత్త సందేహం మొదలైంది.. పవన్ మొన్నటి ప్రసంగాన్ని విశ్లేషించుకుంటూ.. జగన్ తో కలవాలని పవన్ కోరుకుంటున్నాడని.. అందుకు ఉండవల్లి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
జగన్ - పవన్ కల్యాణ్ ని కలిపేంత సమర్థత తనకు లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ‘2019 ఎన్నికల నేపథ్యంలో జగన్ ని - పవన్ ని కలిపే ప్రయత్నాలు మీరు చేస్తున్నారటగా?’ అనే ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో ఆయన సమాధానిమిస్తూ, ‘అంతా ఒట్టిదే. నేను అంత ఆలోచన చేయలేదు. వారిని కలిపేంత సమర్థత నాకు లేదు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలన్నీ పెద్ద బిజినెస్ అన్నారు.
కానీ.. జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ ప్రసంగాన్ని వింటే అందులో జగన్ పై విమర్శలే ఉండవు. టార్గెట్ మొత్తం చంద్రబాబే. దీంతో పవన్ జగన్ తో కలిసి పనిచేసే ఆసక్తితో ఉన్నారన్న ప్రచారం ఒకటి వినిపిస్తోంది. ఉండవల్లి ఆ మాటలను ఖండిస్తున్నా కూడా ఈ ప్రచారం మాత్రం భారీ స్థాయిలో జరుగుతోంది.