అమరావ‌తి విష‌యంలో బాబును హెచ్చ‌రించిన ప‌వ‌న్‌

Update: 2018-04-05 18:05 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో జనసేన అధినేత,  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐవైఆర్ కృష్ణారావు - సీపీఎం నేత మధు - సీపీఐ నేత రామకృష్ణ - సీనియర్ రాజకీయవేత్త వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ అభివృద్ధి ఒకే దగ్గర కేంద్రీకృతమైతే మళ్లీ ప్రాంతీయ విభేదాలు తలెత్తే అవకాశం ఉందని… తిరిగి రాయలసీమ ఉద్యమం కూడా రావచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు వెళ్తే విపత్కర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చ‌రించారు. అమరావతి రాజధాని తమదీ అనే భావన ఏపీ ప్రజలందరిలో కలిగించకపోతే మంచిది కాదని అన్నారు. అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణలాంటి ఉద్యమాలు రాకుండా అభివృద్ధిలో అన్ని ప్రాంతాలను, ప్రజలను భాగస్వామ్యం చేయాలని వివరించారు. పాలకులు చేస్తున్న పనుల వల్ల, అసమాతల వల్ల అస్థిత్వ పోరాటాలు ప్రారంభమవుతాయని, అందరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తే ఆ పరిస్థితి రాదని పవన్ వెల్లడించారు.

‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్ కల్యాణ్ మొదటి కాపీని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావుకి అందించారు. ఈ సందర్భంగా వడ్డె శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. అత్యంత సారవంతమైన భూములను కాంక్రీట్ జంగల్ గా మార్చాలని ఏపీ ప్రభుత్వం చూస్తుందని.. ఆ భూములను చూస్తే ఏడుపు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ద్వారా లబ్ధి పొందేది సింగపూర్ దేశమేనని.. సింగపూర్ కంపెనీలకు, వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కట్టబెడతారా? ప్లాట్లు వేసి అమ్మేందుకు సింగపూర్ కంపెనీలకు భూములివ్వాలా? అని ప్రశ్నించారు. రైతులు భూములు ఇవ్వడమే కాదు, అప్పులు కూడా ఇవ్వాలని చంద్రబాబు అడుగుతున్నారని విమర్శించారు.

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని ఐవైఆర్ కృష్ణారావు వడ్డే శోభనాద్రీశ్వరరావుకు అంకితమివ్వడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ పుస్తకం చదవగానే రాజధాని అంటే ఏమిటి?, ఏ దేశంలో ఏ రాజధాని ఎలా నిర్మించారు? ఆయా రాజధానుల బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు తెలుస్తాయని వెల్లడించారు. అంతేకాకుండా ఐవైఆర్ కృష్ణారావు నిజాలు చెప్పారని, అందుకే ప్రభుత్వం విమర్శిస్తుందని ఉండ‌వ‌ల్లి అన్నారు.
Tags:    

Similar News