కర్ణాటకం : హిజాబ్ పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు? ఏమన్నారంటే...

Update: 2022-02-09 16:30 GMT
కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.ఇవాళ మీడియా మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన తన ఆవేదనను వెళ్లగక్కారు.దేశం ఎటుపోతుందో అర్థం కావడం లేదని, మతం ఆధారంగా వివాదాలు, కల్లోలాలు సృష్టించడం తగదని హితవు చెప్పారు. గతంలో కన్నాఇప్పుడు దేశంలో హిందుత్వ వాదం బాగా ప్రబలుతోందని అన్నారు. మన సంస్కృతికి ఎన్నో ఏళ్ల చరిత్ర  ఉందని, దాన్నొక నినాదంతో సరిపుచ్చడం తగదని, ఒకవేళ అలాంటి నినాదాలతో సంస్కృతి ఆగిపోతే అంత కన్నా దురదృష్టకర పరిణామాలు ఉండవని అన్నారు.

జై శ్రీరామ్ అన్నంత మాత్రాన హిందూ మతాన్ని పరిరక్షించామని భావించడంలో అర్థం లేదు అని అన్నారు. ఇదే సమయంలో  గాంధీని ఉద్దేశించి ఇవాళ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపైనా ఆయన మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం అడిగే సందర్భంలో గాంధీ ఎన్నో త్యాగాలు చేశారని, ఆయన తనకు సంబంధించిన సంపదలు వదుకున్నారు కనుకనే ఇతరులను కూడా అదేవిధంగా చేయమని ప్రార్థించడమో,ఆదేశించడమో చేయగలిగారని ఉండవల్లి అన్నారు. ఇదే సందర్భంలో నాటి స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలు గురించి వివరించి, నాటితో పోలిస్తే నేటి నాయకుల తీరు అత్యంత దిగ్బ్రాంతికర రీతిలో ఉందని చెప్పారు.

సమావేశంలో భాగంగా తొలుత జగన్ పాలనకు సంబంధించి ఎప్పటిలానే వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం పంతులుకు ఉన్నంత తెగువ ఆయనకు ఉందని, కానీ ఆయన పాలనలో అది కనిపించడం లేదు అని ఎద్దేవా చేశారు. పాలనలో రాజశేఖర్రెడ్డి తనదైన ముద్ర వేశారని కానీ జగన్ మాత్రం ఆ స్థాయి విజయాలను కానీ ఫలితాలను కానీ అందుకోలేకపోతున్నారని అన్నారు. అదేవిధంగా సలహాదారులను ఉద్దేశించి కూడా ఉండవల్లి కొన్ని విమర్శలు చేశారు.

పాలన పరంగా సలహాదారులు ఇస్తున్న సూచనలేవీ సబబుగా లేవని తేల్చేశారు.వారి వైఫల్యం కూడా కొట్టొచ్చిన విధంగానే కనిపిస్తుందన్నారు.అదేవిధంగావేతనాలకు సంబంధించి ఉద్యోగులు అడుగుతున్న డిమాండ్లపై కూడా ఉండవల్లి సానుకూలంగానే స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న  ఉచిత పథకాలపై కూడా కొన్ని కామెంట్లు చేస్తూనే, పీఆర్సీ పై ప్రస్తుతం నడుస్తున్న సమస్యపై ఉద్యోగులకు మద్దతుగానే మాట్లాడారు ఉండవల్లి.
Tags:    

Similar News