ఉండవల్లి వారి ఆవేదన...అర్ధం చేసుకోవాల్సిన తరుణమిదే...

Update: 2022-02-18 12:22 GMT
ఆయన మేధావి. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన అందరినీ ఒకే గాటన కట్టాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు రాజకీయాల్లోకి వచ్చి ఏం సంపాదించుకున్నారు అన్నది కూడా ఇక్కడ ప్రశ్నగా ఉంటుంది. మరో వైపు చూస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరు ఒప్పుకోకపోయినా మేధావిగానే చూడాలి. ఆయనది వితండ వాదం కాదు, పిచ్చి వాదన అంతకంటే కాదు, నిక్కచ్చితనంగా చెప్పే నిఖార్సైన  మాటగా చూడాలి.

ఆంధ్రులకు ఎంతటి అన్యాయం జరిగిందో కళ్లకు కట్టినట్లుగా వివరిస్తున్నఉండవల్లి  విధానం అది. ఇదే ఉండవల్లి ఒకనాడు కాంగ్రెస్ కి వీర విధేయుడు. నాడు ఆయన కాంగ్రెస్ పెద్దలకు భవిష్యత్తులో విభజన తరువాత  జరిగే పరిణామాలను వివరించి చెప్పారు.

విభజన వల్ల కాంగ్రెస్ కి నష్టమే అని కూడా తేల్చారు. కానీ వినిపించుకోని ఢిల్లీ ప్రభువులు అహంభావంగా తమ చేతిలో ఉంది కదా అధికార కత్తి అని ఉమ్మడి ఏపీ కుత్తుక కోశారు. అయితే అది అసంబద్ధ విభజన అని నాడే ఉండవల్లి చెప్పారు.

అయితే ఇప్పటికి ఎనిమిదేళ్ళు అయిన తరువాత ఉండవల్లి మాటలకు అర్ధాలు పరమార్ధాలు సామాన్య జనాలకు కూడా మెల్లగా అర్ధమవుతున్నాయి. నిజానికి 2013 నుంచే ఉండవల్లి ఈ విషయంలో మొత్తుకుంటున్నారు. కానీ ఎవరి చెవినా ఆయన రోదన వేదన పడలేదు. ఆయన మహాకవి శ్రీ శ్రీ మాదిరిగా తన కోసం కాదు, జనం కోసం బాధ పడ్డారు, ఈ రోజుకీ పడుతున్నారు.

ఆయనకు దీని వల్ల ఒనకూడేది ఏముంది. తాను రాజకీయాలకు రాను స్వస్తి అనేశారు. ఇక ఆయన కొత్తగా వగచి వేసారి సాధించేది ఏముంది. కానీ ఉండవల్లిది అచ్చమైన ఆంధ్ర పౌరుషం. ప్రస్తుత లెక్కల ప్రకారం చూసినా అయిదు కోట్ల మంది ఆంధ్రులు ఉన్నారు. అందరికీ కలిపి హోల్ సేల్ గా నాటి యూపీయే పెద్దలు కాండు జెల్ల కొట్టేశారు.

ఏ మాత్రం పార్లమెంటరీ సూత్రాలకు అతకని  విధంగా ఏపీని రెండు ముక్కలు చేసి పారేశారు. ఒక రాష్ట్రాన్ని విభజించే హక్కు కేంద్రానికి రాజ్యాంగం కల్పించింది, అంతవరకూ అంతా ఒప్పుకుంటారు, కానీ హక్కు ఉంది కదా అని అడ్డగోలుగా రూల్స్ ని కూడా పక్కన పెట్టి విభజించడం తప్పు కదా.

ఉమ్మడి ఏపీ దక్షిణాన అతి పెద్ద రాష్త్రం. అప్పటికి ఆరు పదుల వయసు ఉన్న రాష్ట్రం. అలాంటి రాష్ట్రం విభజించిన వేళ చర్చ ఉండాలా వద్దా. చిన్న విష‌యమా అది, ఆషామాషీ వ్యవహారం అంతకంటే కాదు కదా. అలాంటిది ఏ మాత్రం చర్చలకు తావు లేదక్కడ. ఈ రోజుకూ అంతా చెప్పుకుంటున్నట్లుగా తలుపులు మూసేసి లైట్లు  ఆర్పేసి మరీ ఏపీని రెండుగా విడగొట్టేసామని అన్నారు.

దానికి కాంగ్రెస్ ఉన్న ఆతృత వచ్చే ఎన్నికల్లో గెలవాలి అని. నిజానికి ఈ విభజన బిల్లులో ఎన్నో అపశృతులు ఉన్నాయి. ఎన్నో అసంబద్ధ అంశాలు ఉన్నాయి. అందుకే యూపీయేలోని మిగిలిన మిత్రులు కూడా యధాతధంగా ఈ బిల్లును ప్రవేశపెడితే మద్దతు ఇవ్వరు.

దాంతో అడ్డగోలుగా కాంగ్రెస్ తెగించేసింది. 2014 ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ఒక వేళ బిల్లుని సభ కాదంటే సెలెక్ట్ కమిటీకి పంపాలని సూచిస్తే విభజన నాడే ఆగిపోయి ఉండేది. ఆ తరువాత  విభజన జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే కాంగ్రెస్ రాజకీయ దాహానికి ఏపీ నిలువునా బలి అయిపోయింది.

అందుకే దాని మీద ఉండవల్లి ఈ రోజుకీ పోరాడుతున్నారు. అటు తెలంగాణా, ఇటు ఏపీ విడిపోయి ఎనిమిదేళ్ళు అయ్యాయి. మూడవ ఎన్నికకు అంతా సిధ్ధమవుతున్న వేళ ఎవరికీ పట్టని ఈ విభజన అంశం ఎందుకు అన్న వారూ ఉన్నారు, కానీ విభజన ఎలా జరిగింది అంటే ఈ రోజుకీ ఎవరైనా సజావుగా సమాధానం చెప్పగలరా, ఇది అన్యాయమైన విభజన, ఏపీలో ఎవరూ అడగరు అనే నిబ్బరంతో అహంకారంతో చేసిన విభజన‌.

దాని మీద ఒకే ఒక్కడుగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రోజుకూ  పోరాడుతున్నారు.  ఆంధ్రుల పౌరుషం ఇదీ అని లోకానికి నిరూపించడానికి పోరాడుతున్న వేళ ఆయనకు మద్దతుగా ఏపీ జనం నిలవాల్సిన సమయం ఇదే.

అంతే కాదు, ఏపీ పాలకులు కూడా బాధ్యతగా విభజన వెనక కధను బయటకు తీయాలి. పార్లమెంట్ లో చర్చకు పెట్టి నాడు జరిగిన ప్రొసీడింగ్స్ ని యావత్తు దేశం చూసేలా చేయాలి. ఏపీ నష్టపోయినట్లుగా మరే రాష్ట్రం ఇక మీదట నష్టపోకుండా చూడాలి. ఈ భారీ నష్టానికి తగిన పరిహారం కూడా ఏపీ జనాలు రాబట్టుకోవాలి.
Tags:    

Similar News