జ‌గ‌న్ కు క్రెడిట్ రాకూడ‌ద‌నే బాబు అవ‌స్థ‌ల‌న్నీ

Update: 2018-05-12 03:43 GMT
ఏపీలో కాస్త గుజ్జున్న అతి కొద్దిమంది నేత‌ల్లో మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. మిగిలిన నేత‌ల మాదిరి ఊక‌దంపుడు మాట‌లు కాకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడే అల‌వాటు ఉండ‌వ‌ల్లిలో మొద‌ట్నించి ఉంది. దుర‌దృష్టం ఏమిటంటే..ఉండ‌వ‌ల్లికి ఉండాల్సినంత ఛ‌రిష్మా లేద‌ని చెప్పాలి. దీనికి ఆయ‌న కూడా ఒక కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

నిజానికి ఉండ‌వ‌ల్లి లాంటి స‌బ్జెక్ట్ ఉన్న నేత‌ల‌కు ప్ర‌జాక‌ర్ష‌ణ తోడైతే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. ఈ విష‌యంలో ఉండ‌వ‌ల్లినే త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తాను మీడియా ముందుకు వ‌చ్చిన ప్ర‌తిసారీ ఆస‌క్తిక‌ర వాద‌న‌ను తెర మీద‌కు తెస్తుంటారు. విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన ఉండ‌వ‌ల్లి.. ఆ త‌ర్వాత ఏ పార్టీకి ప్రాతినిధ్యం వ‌హించ‌కుండా ఉండ‌టం తెలిసిందే.

తాజాగా ప్ర‌త్యేక హోదా అంశంపై బాబు చెల‌రేగిపోతూ వ్యాఖ్య‌లు చేస్తున్న వైనాన్ని సునిశితంగా విమ‌ర్శించ‌ట‌మే కాదు.. బాబు మాట‌ల కార‌ణంగా రాష్ట్రానికి జ‌రుగుతున్న న‌ష్టాన్ని త‌న‌దైన శైలిలో తెర మీద‌కు తీసుకొచ్చారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న మీద మొద‌ట్నించి ఒకే వాద‌న‌ను వినిపిస్తున్న నేత ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డేన‌ని.. ఆయ‌న‌కు ఆ క్రెడిట్ ద‌క్క‌కుండా ఉండేందుకే చంద్ర‌బాబు తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్న వైనాన్ని వివ‌రించారు.

హోదాపై మొద‌ట్నించి త‌న వాద‌న‌ను వినిపిస్తున్న జ‌గ‌న్ బాట‌లోకి ప్ర‌స్తుతం అన్ని పార్టీలు వ‌చ్చేశాయ‌ని.. గ‌తంలో హోదా సాధ‌న విష‌యంలో యూట‌ర్న్ తీసుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం ఏపీ ప్ర‌జ‌ల సెంటిమెంట్‌ ను గుర్తించి హోదాపై పోరాడుతున్నార‌న్నారు.

నాలుగేళ్లుగా హోదా కోసం జ‌గ‌న్ పోరాడుతుంటే.. చంద్ర‌బాబు చివ‌రి ఏడాది సీన్లోకి వ‌చ్చి హోదాపై పోరు అంటూ చేస్తున్న వ్యాఖ్య‌ల్ని ఫీట్లుగా అభివ‌ర్ణించారు. విభ‌జ‌న స‌మ‌యంలో లోక్ స‌భ‌లో జ‌రిగిన ప్ర‌హ‌స‌నంపై వ‌చ్చే శీతాకాల స‌మావేశంలో నోటీసులు ఇవ్వాల‌ని.. విభ‌జ‌న‌పై తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిష‌న్ కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున అఫిడ‌విట్ దాఖ‌లు చేయాలంటూ సీఎం చంద్ర‌బాబుకు తాను రాసిన లేఖ‌ను ఉండ‌వ‌ల్లి విడుద‌ల చేశారు.ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న హోదా సాధ‌న విష‌యంలో మొద‌ట్నించి ఒకే తీరులో పోరాడుతున్నది జ‌గ‌నేన‌ని గుర్తు చేశారు.

హోదాతో ఏం వ‌స్తుంద‌ని.. అదేమైనా సంజీవినా అంటూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల్ని ప్ర‌స్తావించిన ఉండ‌వ‌ల్లి.. ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయ‌మ‌ని బాబు చెప్ప‌టాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు. అలాంటి చంద్ర‌బాబు ఎన్నిక‌లు ఏడాదికి వ‌చ్చిన వేళ‌.. ప్ర‌త్యేక హోదా మీద చేస్తున్న వ్యాఖ్య‌లు స‌రికావ‌న్నారు. హోదా కోసం పోరాడుతున్న‌ది తానేన‌ని బాబు 11 ఛాన‌ళ్ల ద్వారా ప్ర‌చారం చేసుకుంటున్నార‌న్నారు.

పాతిక మంది ఎంపీలు ఇస్తే ప్ర‌త్యేక హోదా తెస్తాన‌ని బాబు చెబుతున్నార‌ని.. అప్ప‌టికి బీజేపీ ప‌వ‌ర్లో కానీ ప్ర‌తిప‌క్షంలో కానీ ఉంటుంద‌ని.. పాతిక‌మంది ఎంపీలు ఉన్నా బాబు మీద ఉన్న క‌క్ష‌తో ఇప్పుడు అడ్డుకున్న‌ట్లే.. రేపొద్దున కూడా అడ్డుకోదా? అన్న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. ఓప‌క్క రాష్ట్రానికి సాయం చేయ‌మ‌ని అడుగుతూనే.. మ‌రోవైపు బ‌డాయి మాట‌లు చెప్ప‌టం స‌రికాదంటూ బాబు వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు.

విభ‌జ‌న నేప‌థ్యంలో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉన్న వేళ‌.. ఆ విష‌యాల్ని ప్ర‌స్తావించ‌కుండా రాష్ట్రం వెలిగిపోతుంద‌ని.. 2029 ముందే ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ రాష్ట్రంగా ఏపీ మారుతుందంటూ చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేయ‌టం స‌రికాద‌న్నారు. జీడీపీలో మ‌న‌మే టాప్ అంటూ గొప్ప‌లు చెప్పుకుంటున్న వేళ‌.. అంతా బాగున్న‌ప్పుడు హోదా అవ‌స‌రం ఏమిటంటూ మ‌ద్ద‌తు ఇచ్చే వారు సైతం క్వ‌శ్చ‌న్ చేసే అవ‌కాశం ఉంద‌న్న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. దేబిరించాల్సిన స‌మ‌యంలో కాలు మీద కాలు వేసుకొని ఫోజులు కొడితే ఎలా? అంటూ ప్ర‌శ్నించిన ఉండ‌వ‌ల్లి వాద‌న‌లో రాజ‌కీయం కంటే నిజం పాళ్లే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News