జెఫ్ బెజోస్‌ కు ఊహించని అవమానం...,ప్రముఖులు ఫైర్, ఏమైందంటే ?

Update: 2021-07-22 10:30 GMT
ప్రముఖ ఈ కామర్స్ అమెజాన్ అధినేత బెజోస్‌ అంతరిక్ష యానాం చేసి చాలా సంతోషంగా ఉన్న సమయంలోనే ఊహించని పరిణామం ఎదురైంది. తన స్పేస్‌ టూర్‌ విజయవంతమైనందుకు అమెజాన్‌ ఉద్యోగులకు, కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు బెజోస్‌. ఇందులో ఇబ్బంది ఏముంది అంటారా..  ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది.  తన 11 నిమిషాల రోదసీ యాత్ర పూర్తి చేసుకువచ్చిన తర్వాత బెజోస్ అమెజాన్‌ ఉద్యోగులకు, కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్ర‌తి అమెజాన్ ఉద్యోగి, అమెజాన్ క‌స్ట‌మ‌ర్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను.

దీనికి డ‌బ్బు చెల్లించింది మీరే అని బెజోస్ అన్నారు. ప్రపంచ బిలియనీర్‌ గా ఉన్నా బెజోస్‌ పన్నులు చెల్లించకుండా, ప్రజల సొమ్ముతో టూర్‌ కు వెళ్లొచ్చావు అన్నట్టుగా రాజకీయ ప్రముఖులు, నెటిజన్ల నెగిటివ్‌ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి.

ప్ర‌పంచంలోనే రిచెస్ట్ అయినా కూడా కొన్నేళ్లుగా బెజోస్ ఎప్పుడూ ప‌న్నులు క‌ట్ట‌డం లేదు. దీనికితోడు అమెజాన్‌లో వ‌ర్క‌ర్ల నుంచి శ్ర‌మ దోపిడీ ఉంటుంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. క‌నీసం తిన‌డానికి, ఒక్కోసారి బాత్‌ రూమ్‌ కి వెళ్ల‌డానికి కూడా స‌మ‌యం ఉండ‌ద‌ని అమెజాన్‌ లో ప‌నిచేసే ఉద్యోగులు చెబుతుంటారు. ఈ విష‌యాన్నే గుర్తు చేస్తూ ట్విట‌ర్‌ లో బెజోస్‌ కు వ్య‌తిరేకంగా ఎన్నో నెగెటివ్ కామెంట్స్ వ‌స్తున్నాయి. తక్కువ జీతాలు, దారుణమైన, అమానవీయ ఆఫీసు వాతావరణం, కరోనా మహమ్మారి సమయంలో కూడా డెలివరీ డ్రైవర్లకు ఆరోగ్య బీమా లేకుండా అమెజాన్‌ ఉద్యోగులే ఇదంతా భరించారంటూ అమెరికా చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధి లెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ ట్విటర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెజాన్ తన మార్కెట్ శక్తిని దుర్వినియోగం చేస్తూ, చిన్న వ్యాపారాలను దెబ్బతీసేందుకే ఉద్యోగులు చెల్లిస్తున్నారన్నారు. ప‌న్నులు క‌ట్ట‌కుండా అమెరిక‌న్లు చెమ‌టోడ్చి సంపాదించి క‌ట్టిన ప‌న్నుల‌తోనే స్పేస్‌ టూర్‌ చేసి వచ్చారంటూ సెనేట‌ర్ ఎలిజ‌బెత్ వారెన్ ట్వీట్‌ చేశారు. కానీ అమెరికన్లకు థ్యాంక్స్ చెప్ప‌డం మాత్రం మ‌ర‌చిపోయాంటూ మండిపడ్డారు. మరోవైపు కెన‌డాలోని న్యూడెమొక్ర‌టిక్ పార్టీ నేత జ‌గ్‌మీత్ సింగ్ కూడా  బెజోస్‌ ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. 11 నిమిషాల్లో బెజోస్‌ యాత్ర ముగిసింది. కానీ కరోనా వైరస్‌ మహమ్మారి కాలంలో ప్రతి 11 నిమిషాలకు (16 ల‌క్ష‌ల డాల‌ర్లు) మిలియన్ల డాలర్లు మూటగట్టుకుని మరింత కుబేరుడిగా అవతరించాడని వ్యాఖ్యానించారు.  

అమెజాన్‌ పై ఎలాంటి పన్నులు లేకుండా అనుమతించిన ప్రధాని జస్టిన్  ట్రూడో చలవే ఇదంతా అని ట్వీట్‌ చేశారు.  కాగా బిలియనీర్‌ బెజోస్‌ పై అమెరికాలో పన్ను ఎగవేత ఆరోపణలు అమెజాన్ ఉద్యోగులకు తగిన జీతాలు చెల్లించకపోడం, ప్రమాదకరమైన పని పరిస్థితులు, భోజన, వాష్‌రూం విరామాలను కూడా తీసుకోనీయకుండా వేధింపులకు పాల్పడుతోందంటూ చెలరేగిన విమర్శల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  జెఫ్ బెజోస్ మంగళవారం 11 నిమిషాల్లో చారిత్రాత్మక అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే.  ఇలాంటి ప్ర‌ముఖులే కాకుండా ట్విట‌ర్‌లో చాలా మంది బెజోస్ కామెంట్స్‌పై ప్ర‌తికూలంగానే స్పందించారు.


ప్రపంచ కుబేరుడు,అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ అంతరిక్షయాత్ర విజయవంతమైన విషయం తెలిసిందే . బ్లూ ఆరిజిన్‌ అభివృద్ది చేసిన న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో జెఫ్ బెజోస్ బృందం నింగిలోకి దూసుకెళ్లింది. కేవలం పదంటే పది నిమిషాల్లో ఈ యాత్ర పూర్తవడం విశేషం. న్యూ షెఫర్డ్ వ్యోమనౌక భూమి నుంచి 45 మైళ్ల దూరం నింగిలో ప్రయాణించాక.. దాని నుంచి క్యాప్సూల్ విడివడింది. ఈ క్యాప్సూల్ భూమి నుంచి 62 మైళ్ల దూరం వరకు నింగిలో ప్రయాణించింది.  అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9.00గంటల సమయంలో టెక్సాస్‌ ఎడారి ప్రాంతంలోని ఓ ప్రదేశం నుంచి న్యూ షెఫర్డ్ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. అంతకుముందు,8.30గంటల సమయానికి జెఫ్ బెజోస్ బృందం ఆ ప్రదేశానికి చేరుకుంది. ఆ తర్వాత న్యూ షెఫర్డ్ స్పేస్ క్రాఫ్ట్‌ లోకి అంతా ఒకేసారి ఎక్కారు. 8.45గంటల సమయంలో క్యాప్సూల్ తలుపులు మూసుకున్నాయి. 9గంటల సమయంలో స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లింది.

అంతరిక్షంలో సుమారు నాలుగు నిమిషాల పాటు జెఫ్ బెజోస్ బృందం జీరో గురుత్వాకర్షణ ప్రభావాన్ని  అనుభూతి చెందింది. పది నిమిషాల్లోనే దాదాపు 62 మైళ్ల దూరం ప్రయాణాన్ని ముగించుకుని స్పేస్ క్రాఫ్ట్ క్యాప్సూల్ తిరిగి భూమిని చేరింది. దీంతో జెఫ్ బెజోస్ బృందం విజయానందంలో మునిగిపోయింది. జెఫ్ బెజోస్‌ తో పాటు ఆయన సోదరుడు మార్క్,82 ఏళ్ల మాజీ పైలట్ వాలీ ఫంక్,18 ఏళ్ల టీనేజర్ అలివర్ డేమన్ రోదసియాత్రలో భాగస్వాములయ్యారు. అంతరిక్షంలోకి వెళ్తున్న అత్యంత పిన్న వయస్కుడిగా అలివర్,అత్యంత పెద్ద వయస్కుడిగా వాలీ ఫంక్ చరిత్ర సృష్టించారు.భవిష్యత్తులో స్పేస్ టూరిజాన్ని అందించాలన్న లక్ష్యంతో జెఫ్ బెజోస్ దీన్ని చేపట్టారు. ఇటీవలే ప్రముఖ బ్రిటీష్ కుబేరుడు రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్షయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News