మోడీ ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్ ను వ‌ద్ద‌న‌లేదు: కేటీఆర్‌కు కేంద్రం వివ‌ర‌ణ‌

Update: 2022-04-29 08:34 GMT
కేంద్ర ప్ర‌భుత్వానికి-తెలంగాణ స‌ర్క‌రుకు మ‌ధ్య మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఖండించారు. ప్రధాని మోడీ కొన్నిరోజుల కింద‌ట‌ హైదరాబాద్ పర్యటన కు వ‌చ్చిన స‌మ‌యంలో సీఎం కేసీఆర్ పాల్గొనకుండా చూడాలంటూ ప్రధాన మంత్రి కార్యాలయం సందేశం పంపినట్లు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని ఆయ‌న అన్నారు. ఈ మేర‌కు  ట్వీట్ చేశారు.

"మోడీ హైదరాబాద్‌ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనకుండా చూడాలని ప్రధాని కార్యాలయం సందేశం పంపినట్లు తెలంగాణ సీఎం కుమారుడు కేటీఆర్‌ వ్యాఖ్యానించినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఇది పూర్తిగా అబద్ధం. పీఎంవో అలాంటి సందేశం ఏదీ పంపలేదు.

వాస్తవానికి ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు, ఆయన కార్యక్రమాల్లో కేసీఆర్‌ పాల్గొంటారని ఆశించాం. ఆరోగ్యం బాగాలేనందున ఆయన హాజరుకాలేకపోతున్నట్లు సీఎం కార్యాలయమే పీఎంవోకు సమాచారం అందించింది" అని జితేంద్రసింగ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదే విషయంపై బీజేపీ ఫైర్ బ్రాండ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా స్పందించారు. అనారోగ్యం వల్ల ప్రధాని కార్యక్రమానికి వెళ్లడంలేదని సీఎం కేసీఆర్‌ అప్పట్లో ప్రకటన చేశారని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్‌ ఓ ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందుకు భిన్నంగా మాట్లాడారని, మోడీని అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. తండ్రీ కొడుకుల రాజ‌కీయం హ‌ద్దులు మీరుతోంద‌న్నారు. స‌రైన స‌మ‌యంలో ఇద్ద‌రికీ బుద్ధి చెబుతామ‌న్నారు.

కాగా, ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో హైద‌రాబాద్ శివారులోని ముచ్చింత‌ల్‌లో చిన‌జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో స‌మ‌తామూర్తి రామానుజాచార్యుల విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ‌చ్చారు.  సాయంత్రం 4 గంట‌ల‌కు వ‌చ్చిన ఆయ‌న దాదాపు 5 గంట‌ల పాటుఇక్క‌డే ఉన్నారు.

ప్ర‌త్యేక పూజ‌లు కూడా చేశారు. అయితే.. ప్రొటోకాల్ ప్ర‌కారం .. ముఖ్య‌మంత్రి హాజ‌రు కావాల్సి ఉన్నా.. కేసీఆర్ రాలేదు. అప్ప‌ట్లో ముఖ్య‌మంత్రి అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్నార‌ని.. అందుకేరాలేద‌ని.. ప్ర‌క‌టించారు. అయితే.. ఇటీవ‌ల కేటీఆర్‌.. అస‌లు సీఎంనేరావొద్ద‌ని.. పీఎంవో చెప్పింద‌న్నారు. దీంతో తాజాగా కేంద్రం వివ‌ర‌ణ ఇచ్చింది. మ‌రి దీనిపై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News