పీపీఏగా యూపీఏ!... పేరు మారితే రాత మారుతుందా?

Update: 2019-02-20 13:36 GMT
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ సార‌థ్యంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అల‌యెన్స్ (యూపీఏ) నెత్తిన ఇప్పుడు లెక్క‌లేన‌న్ని కుంభ‌కోణాలు ఉన్నాయి. అయితే కుంభ‌కోణాలు ఉన్నాయ‌ని, రాజ‌కీయ పార్టీలో ఇంట్లో కూర్చుని ఆ అప్ర‌తిష్ఠ‌ను త‌లుచుకుని కుమిలిపోలేవు క‌దా. త‌మ‌పై ప‌డిన మ‌చ్చ‌ను చెరిపేసుకునేందుకు వైరి వ‌ర్గంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఎత్తుకుంటే స‌రి. ఇదే వ్యూహాన్ని అమ‌లు చేస్తున్న యూపీఏ... ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న దరిమిలా... కుంభ‌కోణాల మ‌యంగా మారిపోయిన యూపీఏ పేరును తొల‌గించుకునేందుకు దాదాపుగా నిర్ణ‌యించిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ఈ కూట‌మిలోని కొన్ని పార్టీలు బ‌య‌ట‌కు వెళ్ల‌గా, ఇప్పుడు మ‌రికొన్ని పార్టీలు వ‌చ్చి చేరుతున్నాయి. ఈ నేప‌థ్యంలో న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలోని ఎన్డీఏను ఈ ద‌ఫా ఎలాగైనా గ‌ద్దె దించాల‌న్న సింగిల్ ఎజెండాతో ఉన్న పార్టీల‌ను ఒక్క‌ద‌రికి చేర్చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ... ప‌నిలో ప‌నిగా యూపీఏ పేరును కూడా మార్చేసేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

యూపీఏ పేరు విన‌గానే... 2జీ స్కాం, బొగ్గు కుంభ‌కోణం ఠ‌క్కున గుర్తుకు వ‌స్తున్నాయి. దీంతో ఈ పేరుతోనే ఎన్నిక‌ల‌కు వెళితే.. ఓట‌ర్ల‌కు మ‌రోమారు ఆ స్కాంల‌ను గుర్తు చేయ‌డ‌మేన‌న్న భావ‌న‌తోనే ఇప్పుడు పేరు మార్పిడి వ్య‌వ‌హారానికి తెర లేసిన‌ట్లు స‌మాచారం. యూపీఏ పేరు వ‌ద్ద‌నుకుంటే... ఇంకేం పేరు పెడ‌తార‌న్న కోణంలో ఇప్ప‌టికే ప‌లు పేర్లను ఆలోచించిన కాంగ్రెస్‌, దాని మిత్ర‌ప‌క్షాలు.... పీపీఏ ను ఖ‌రారు చేసిన‌ట్టుగా విశ్వ‌స‌నీయ స‌మాచారం. పీపీఏ అంటే... పీపుల్స్ ప్రొగ్రెసివ్ అల‌యెన్స్ అన్న‌మాట‌. అంటే యూపీఏలోని యునైటెడ్ కు బ‌దులుగా పీపుల్స్ అనే ప‌దాన్ని మాత్ర‌మే మారుస్తున్నార‌న్న మాట‌. మొత్తంగా ప్రొగ్రెసివ్ అన్న ప‌దాన్ని వ‌దిలేందుకు స‌సేమిరా అంటున్న కాంగ్రెస్ ఒక్క యునైటెడ్ అన్న ప‌దాన్ని మార్చేందుకు మాత్రమే సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్నిక‌ల‌కు ముందుగానే ఈ పేరును మార్చేయ‌డంతో పాటుగా భావ సారూప్య‌త క‌లిగిన మ‌రిన్ని ఇత‌ర పార్టీల‌ను కూడా త‌న కూట‌మిలో క‌లుపుని పోయేందుకు కూడా కాంగ్రెస్ వ్యూహం ర‌చిస్తోందట‌.

ఈ క్ర‌మంలోనే కామ‌న్ మినిమ‌న్ ప్రోగ్రాంను ఎన్నిక‌ల‌కు ముందుగానే నిర్దేశించాల‌న్న తృణ‌మూల్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌తిపాద‌న‌కు కూడా రాహుల్ ఓకే అన్నార‌ట‌. ఈ నెల 25, 26 తేదీల్లో జ‌ర‌గ‌నున్న భాగ‌స్వామ్య ప‌క్షాల భేటీకి ముందుగానే ఈ క‌స‌రత్తును ముగించాల‌నుకున్నా... కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌లేద‌ని, ఆ భేటీలో ప‌లు అంశాల‌పై చ‌ర్చించిన మీద‌ట కామ‌న్ మినిమ‌న్ ప్రోగ్రాంకు ఓ బ్లూ ప్రింట్ ఇస్తార‌ట‌. మొత్తంగా ఈ బ్లూప్రింట్ మాట దవుడెరుగు గానీ.. యూపీఏ పేరును పీపీఏగా మారుస్తున్న వైనం మాత్రం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మరి ఈ పేరు మార్చిన త‌ర్వాతైనా యూపీఏ... అదే పీపీఏ రాత మారుతుందో, లేదో చూడాలి.
Tags:    

Similar News