ఉక్రెయిన్ : క‌న్నీళ్లు..వెతలు..యుద్ధ వైఖ‌రికి తార్కాణాలు

Update: 2022-04-21 02:11 GMT
ఏమిచ్చినా ఈ వైరం ఆప‌డం క‌ష్టం. ఏం చెప్పినా  కూడా ఈ వైరం ఆప‌డం క‌ష్టం. సాహ‌సం కూడా! దేశాలు ఆ సాహ‌సానికి  పూనుకోనంత వ‌ర‌కూ భ‌విష్య‌త్ లో శాంతి పేరిట ఏ చ‌ర్చ కూడా జ‌ర‌గ‌దు గాక జ‌ర‌గ‌దు.

ఇప్పుడు నోర్మూసుకుని ప‌డి ఉంటున్న దేశాల‌కు రేప‌టి వేళ ఇలాంటి స‌మ‌స్యే వ‌స్తే అప్పుడు కానీ అవి మేల్కోవు. భార‌త్ అత్యంత త‌ట‌స్థ వైఖ‌రితో ముందుకు పోతోంది.

ఎందుకు వ‌చ్చిన గొడ‌వ అని ఉక్రెయిన్ కు కాస్త ఆహార సాయం, కాస్త మందులు సాయం చేసి చేతులు దులుపుకుంటోంది.ర‌ష్యాతో మాత్రం చ‌మురు దిగుబ‌డుల‌కు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలు కొన‌సాగిస్తూ, తాము ఎక్క‌డ త‌క్కువ ధ‌ర ఉంటే అక్క‌డ కొనుగోలు చేస్తామ‌ని మోడీ తెలివితో కూడిన ప్ర‌సంగం ఒక‌టి ఇస్తున్నారు.

ఉపన్యాస ధోర‌ణి ఎలా ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కూ ఇరు దేశాల‌ను నిలువ‌రించ‌డం, ఇరు దేశాల‌కూ హిత‌వు చెప్ప‌డం అన్న‌వి ఎవ్వ‌రూ చేయ‌క‌పోవ‌డ‌మే ఆశ్చ‌ర్య‌క‌రం. అంటే రెండు దేశాలు కొట్టుకుంటుంటే మూడో దేశం ప్ర‌మేయం అమెరికా మాదిరిగా ఉండాల‌న్న మాట ! లేదా కేవ‌లం అవ‌స‌రాలు లేదా ఆయుధాలే మాట్లాడ‌తాయి అన్న మాట.. ఇదే ఇప్పుడు ఉక్రెయిన్ ను క‌దిపి కుదుపుతున్న ప‌రిణామాల‌కు కార‌ణం.

ప్ర‌స్తుతం మేరియుపొల్ న‌గ‌రాన్ని త‌న నియంత్ర‌ణ‌లోకి తెచ్చుకోవ‌డ‌మే ర‌ష్యా సేన‌ల ల‌క్ష్యంగా ఉంద‌ని ఉక్రెయిన్ సైనికాధికారి ఒక‌రు వ్యాఖ్యానించార‌న్న వార్త ప్ర‌ధాన మీడియాలో వెలుగు చూసింది. ఇక‌పై ఈ అనాగరిక చ‌ర్య‌లు ఆగితే బాగుండు అన్న మాట ఉక్రెయిన్ సైన్యం నుంచి వ‌స్తున్న‌ది.

కానీ చ‌ర్చ‌లకు సంబంధించి బంతి ఉక్రెయిన్ కోర్టులోనే ఉంద‌ని ర‌ష్యా అంటోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ దారుణ విధ్వంసాలు మాత్రం ఆప‌డం లేదు ర‌ష్యా. ఇదే విధంగా త‌మ చ‌ర్య‌లు కొన‌సాగించేందుకే ర‌ష్యా మొగ్గు చూపుతూ మధ్య మ‌ధ్య‌లో శాంతి వ‌చ‌నాలు చెప్ప‌డ‌మే ఆశ్చ‌ర్య‌క‌రం.
Tags:    

Similar News