కేసీఆర్‌-పీకే మ‌ధ్య అలాంటి చ‌ర్చ‌లు జ‌రిగాయా..? టీ కాంగ్రెస్ ఊపిరి పీల్చుకో..!

Update: 2022-04-30 04:22 GMT
ఆహా.. ఏమి రాజ‌కీయం. ఇలాంటి ట్విస్టులు ఉంటేనే క‌దా అది రాజ‌కీయం అనేది. ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడ‌లు ఎప్పుడు అవుతాయో ఎవ‌రికీ తెలియ‌దు. ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయం అలాగే మారింది. పీకే, కేసీఆర్ ఒక్క భేటీతో రాజ‌కీయాలు త‌ల‌కిందుల‌య్యాయి. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పొత్తుపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వెలువ‌డ్డాయి. ఈ విష‌యంలో బీజేపీ ఒక అడుగు ముందుకు వేసింది. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయ‌ని.. టీ కాంగ్రెస్ కు 30 అసెంబ్లీ, 4 పార్ల‌మెంటు స్థానాల‌ను కేసీఆర్ ఆఫ‌ర్ చేశార‌ని ఆరోపించింది. దీంతో అంత‌టా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రిగాయి.

ఈ ఊహాగానాల‌కు ఇంత‌టితో తెర‌ప‌డ‌లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు టీఆర్ఎస్ మ‌ద్ద‌తు ఇవ్వాలంటే తెలంగాణ కాంగ్రెస్ తాను చెప్పిన‌ట్లు వినాల‌ని.. త‌న‌కు బ‌ద్ధ శ‌త్రువైన రేవంతును అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి తొల‌గించాల‌ని.. తాను సూచించిన వ్య‌క్తికి ఆ ప‌ద‌వి ఇవ్వాల‌ని కేసీఆర్ పీకేతో అన్న‌ట్లు గుస‌గుస‌లు వెలువ‌డ్డాయి.

అలాగే పొత్తులో భాగంగా.. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమ‌టి రెడ్డి, ఉత్త‌మ్ ల‌కు అవే స్థానాలు కేటాయిస్తామ‌ని.. వారిని రాష్ట్ర రాజ‌కీయాల్లో అడుగుపెట్ట‌డానికి వీలు లేద‌ని కేసీఆర్ డిమాండ్ చేశార‌ట‌.

అలాగే.., టీఆర్ఎస్‌, కాంగ్రెస్ ఉమ్మ‌డి ప్ర‌భుత్వం ఏర్ప‌డితే త‌న కుమారుడు కేటీఆర్ సీఎం కుర్చీలో కూర్చుంటార‌ని.. తాను దేశ రాజ‌కీయాల‌వైపు ప‌య‌నించి మోదీతో ఢీకొంటాన‌ని అన్నార‌ట‌. అవ‌స‌ర‌మైతే ప్ర‌ధాని ప‌ద‌విని తానే చేప‌డ‌తాన‌ని స్ప‌ష్టం చేశార‌ట‌.

ఈ చ‌ర్చ‌ల సారాంశాన్ని పీకే ఢిల్లీకి మోసుకెళ్ల‌డంతో అధిష్ఠానానికి క‌ళ్లు బైర్లు క‌మ్మాయ‌ట‌. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం మాదిరిగా కేసీఆర్ డిమాండ్ల‌తో బెంబేలెత్తిన అధిష్ఠానం పొత్తు అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పింద‌ట‌. అయితే పీకే మాత్రం తాను కాంగ్రెస్ కు ప‌నిచేస్తూనే టీఆర్ఎస్ కు స‌ల‌హాదారుడిగా ఉంటాన‌ని చెప్పార‌ట‌. ఇందుకు సోనియా టీం స‌సేమిరా అంద‌ట‌.

దీంతో తెలంగాణ కాంగ్రెస్ ఊపిరి పీల్చుకొంది. గ‌త నాలుగైదు రోజులుగా జ‌రుగుతున్న సందిగ్ధ ప‌రిస్థితుల్లోంచి బ‌య‌ట‌ప‌డింది. ఐప్యాక్ సంస్థ అధినేత ప్ర‌శాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరొద్ద‌ని తీసుకున్న నిర్ణ‌యం టీ కాంగ్రెస్ కు ఊర‌ట‌నిచ్చింది. పార్టీలో చేరి ప‌నిచేయాల్సిందిగా సోనియా సూచించిన ఆఫ‌ర్ ను పీకే తిర‌స్క‌రించ‌డంతో క‌థ మొద‌టికొచ్చింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ కు రూట్ క్లియ‌ర్ అయింది. రేవంత్ ఆధ్వ‌ర్యంలో ఇక త‌మ ల‌క్ష్యం వైపు ప‌రుగులు పెట్టేందుకు శ్రేణులు సిద్ధ‌మ‌వుతున్నారు.
Tags:    

Similar News