మ‌హారాష్ట్రలో ఏం జ‌రుగుతోంది?

Update: 2021-11-03 10:00 GMT
ఓ వైపు క్రూజ్ నౌక‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. ఆ ఘ‌ట‌న‌లో ఎన్‌సీబీ డైరెక్ట‌ర్ స‌మీర్ వాంఖ‌డేపై రాజ‌కీయ నేత‌ల ఆరోణ‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన నేప‌థ్యంలో మ‌రోవైపు తాజాగా నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత‌ల‌పై ఈడీ దాడులు.. అరెస్టులతో రాజకీయ వేడి మ‌రింత పెరిగింది. అస‌లు మ‌హారాష్ట్రలో ఏం జ‌రుగుతుంద‌నేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అక్టోబ‌ర్ 2న ముంబ‌యి క్రూజ్ నౌక డ్ర‌గ్స్ కేసులో బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్యాన్ ఖాన్‌తో స‌హా 20 మందిని మాద‌కద్ర‌వ్యాల నియంత్ర‌ణ సంస్థ (ఎన్‌సీబీ) అరెస్ట్ చేసింది. ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట‌యిన ఆర్య‌న్ దాదాపు 20 రోజుల త‌ర్వాత బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

క్రూజ్ నౌక డ్ర‌గ్స్ కేసు నేప‌థ్యంలో ఎన్‌సీబీ ముంబ‌యి జోనల్ డైరెక్ట‌ర్ స‌మీర్ వాంఖ‌డే డ‌బ్బులు డిమాండ్ చేశార‌ని ఆరోప‌ణ‌లు తెర‌మీదకు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆర్య‌న్ను కేసు నుంచి త‌ప్పించేందుకు అత‌ని తండ్రి షారుక్‌ను రూ.25 కోట్లు డిమాండ్ చేశార‌ని చివ‌ర‌కు రూ.18 కోట్ల‌కు బేరం కుదిరిందని అందులో రూ.8 కోట్లు వాంఖ‌డేకు ఇవ్వాల్సి ఉంటుంద‌ని డీల్ మాట్లాడిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షి కోర్టుకు చెప్ప‌డంతో పెను వివాదం చెల‌రేగింది. దీనిపై ఇప్పుడు విచార‌ణ జ‌రుగుతోంది. మ‌రోవైపు వాంఖ‌డేపై మొద‌టి నుంచి ఎన్‌సీపీ సీనియ‌ర్ నేత న‌వాబ్ మాలిక్ ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉన్నారు. వాంఖ‌డే డ‌బ్బు కోసం బెదిరింపుల‌కు పాల్ప‌డ‌తార‌ని అందుకోసం ఓ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నార‌ని న‌వాబ్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

ఇక తాజాగా మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌రో క‌ల‌క‌లం చెల‌రేగింది. న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి ఎన్‌సీపీ నాయ‌కుడు అనిల్ దేశ్‌ముఖ్‌ ఈడీ అరెస్టు చేసింది. గ‌తంలో ఆయ‌న హోం మంత్రిగా ఉన్న‌ప్పుడు ముంబ‌యిలోని ప‌లు బార్లు, రెస్టారెంట్ల నుంచి నెల‌నెలా రూ.100 కోట్లు వ‌సూలు చేయాల్సిందిగా పోలీసుల‌ను ఆదేశించార‌ని మాజీ పోలీసు క‌మిష‌న‌ర్ ప‌ర‌మ్‌బీర్ సింగ్ గ‌తంలో చేసిన ఆరోప‌ణ‌లు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అనిల్‌తో పాటు ఆయ‌న సన్నిహితుల‌పై సీబీఐ ద‌ర్యాప్తు మొద‌లెట్టింది. రంగంలోకి దిగిన ఈడీ కూడా నగ‌దు అక్ర‌మ చ‌లామ‌ణి నిరోధ‌క చ‌ట్టం నిబంధ‌న‌ల ప్ర‌కారం అనిల్‌ను అరెస్టు చేసింది.

ఈ అరెస్టు జ‌రిగిన కొన్ని గంట‌ల‌కే మ‌రో ఎన్‌సీపీ సీనియ‌ర్ నేత రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్‌కు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆయ‌న కుటుంబ స‌భ్యులు, బంధువుల‌కు చెందిన దాదాపు రూ.1400 కోట్ల విలువైన ఆస్తుల‌ను తాత్కాలికంగా జ‌ప్తు చేసింది. అక్టోబ‌ర్ 7న ప‌వార్ కుటుంబ స‌భ్యులు, బంధువుల ఆస్తుల‌పై ఐటీ శాఖ త‌నిఖీలు చేసిన సంగ‌తి తెలిసిందే. అప్పుడు సోదాల్లో రూ.184 కోట్ల వెల్ల‌డించని ఆదాయం బ‌య‌ట‌ప‌డింద‌ని ఐటీ ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చ‌ట్టం కింద ఇప్పుడీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసింది. మొత్తానికి మ‌హారాష్ట్రలో అధికారంలో ఉన్న శివ‌సేన కాంగ్రెస్ ఎన్సీపీ కూట‌మి ప్ర‌భుత్వానికి ఈ ర‌కంగా గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్ల‌యింది.


Tags:    

Similar News