మంత్రి మెరుగు వ్యాఖ్య‌ల‌పై ఏపీ అసెంబ్లీలో తీవ్ర దుమారం!

Update: 2022-09-15 09:29 GMT
ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో సెప్టెంబ‌ర్ 15న మొద‌టి రోజే అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష టీడీపీ స‌భ్యుల మధ్య తీవ్ర దుమారం చోటు చేసుకుంది. ఇక ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్టడీ సర్కిల్స్ విషయంలో.. సాంఘిక సంక్షేమ శాఖ‌ మంత్రి మేరుగ నాగార్జున సమాధానం చెబుతున్నప్పుడు టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో మంత్రి నాగార్జున తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్ర‌కాశం జిల్లా కొండెపి టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిపై మంత్రి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. నువ్వు దళితుడివైతే, దళితులకు పుడితే.. టీడీపీ అధినేత చంద్రబాబు బంధనాల నుంచి బయటకు రావాలంటూ వ్యాఖ్యానించి క‌ల‌క‌లం రేపారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌కాశం జిల్లా కొండెపి టీడీపీ ఎమ్మెల్యే అయిన డోలా బాల వీరాంజనేయస్వామిపై సాంఘిక సంక్షేమ శాఖ‌ మంత్రి మేరుగ నాగార్జున చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర దుమారానికి కార‌ణ‌మ‌య్యాయి. దళితులకే పుట్టావా అంటూ మంత్రి మేరుగ .. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజ‌నేయ‌స్వామిని ఉద్దేశించిన‌ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీంతో శాసనసభలో మంత్రి మేరుగ నాగార్జున‌పై టీడీపీ ప్రివిలేజ్ మోషన్‌ను ఇచ్చింది. కులాన్ని ప్రస్తావించి మంత్రి మేరుగ నాగార్జున‌.. మాట్లాడారని టీడీపీ సభ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే టీడీపీ సభ్యుల్ని తాను ఏమీ అనలేదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించలేదని మంత్రి మేరుగ చెప్పారు.

అయితే మేరుగ నాగార్జున‌ చేసిన వ్యాఖ్యలన్నీ రికార్డుల్లో ఉన్నాయని... రికార్డులు చెక్ చేసి వాళ్లు ఆ మాట అనలేదంటే తాను రాజీనామా చేస్తానని బాల వీరాంజనేయస్వామి సవాల్ విసిరారు. త‌న‌పై చేసిన వ్యాఖ్యలకు మంత్రి మేరుగ నాగార్జున‌ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారనుకున్నాన‌ని.. త‌న పుట్టుక గురించి అవ‌మానించేలా అసెంబ్లీలో మాట్లాడటం సరికాదని డోలా బాల వీరాంజ‌నేయస్వామి నిప్ఉలు చెరిగారు.

కాగా ఈ వ్య‌వ‌హారంలో మంత్రి మేరుగ నాగార్జున‌కు మంత్రులు అండ‌గా నిల‌బ‌డ్డారు. మంత్రి మేరుగను కావాల‌నే ఉద్దేశ‌పూర్వ‌కంగా టీడీపీ సభ్యులు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. బాలవీరాంజనేయ స్వామి హద్దు దాటి మాట్లాడుతున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ఎవరైనా ఎస్సీలుగా పుట్టడానికి ఇష్టపడతారా అని గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారని సభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గుర్తు చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News