కాబూల్ పేలుళ్లకు ప్రతీకారంగా అమెరికా వైమానిక దాడులు షురూ

Update: 2021-08-28 06:30 GMT
తన వరకు వచ్చేసరికి అమెరికా ఎలా వ్యవహరిస్తుందో అందరికి తెలిసిందే. తన ప్రయోజనాలకు కించిత్ నష్టం వాటిల్లినా తట్టుకోలేని అగ్రరాజ్యం.. తాజాగా కాబూల్ విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న జంట పేలుళ్ల విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. మామూలుగా అయితే.. ఇదో పెద్ద విషయంగా భావించేది కాదు. కానీ.. ఎప్పుడైతే ఈ జంట పేలుళ్లలో 13 మంది అమెరికన్ సైనికులు మరణించటం తెలిసిందే. ఈ విషాద ఉదంతంలో మొత్తం 200 మంది పౌరులు తమ ప్రాణాల్ని కోల్పోయారు. తమ సైనికుల మరణాలకు మూల్యం చెల్లించక తప్పదన్న అమెరికా.. అందుకు తగ్గట్లే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇదే ఉదంతంలో మరో 18 మంది అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

జంట పేలుళ్లకు వారు భారీ మూల్యం చెల్లించాల్సి  ఉంటుందని.. అమెరికా ప్రయోజనాల్ని.. తమ ప్రజల్ని కాపాడుకోవటానికి తనకున్న అన్ని అధికారాలన్నీ ఉపయోగిస్తానని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వ్యాఖ్యానించారు. ‘‘జంట పేలుళ్లలో ప్రాణాల్ని త్యాగం చేసిన అమెరికా సర్వీసు సభ్యులు.. హీరోలు. వారికి ఇదే సరైన పదం. ఈ దాడులు జరిపించింది ఐసిస్. వారి స్థావరాల్ని.. ఆస్తుల్ని ధ్వంసం చేయటానికి.. దాని నాయకుల్ని మట్టుబెట్టటానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని మా కమాండర్లకు ఆదేశించాను. సరైన సమయంలో.. సరైన చోట వారిని దెబ్బ తీస్తాం’ అని పేర్కొన్న కొన్ని గంటల వ్యవధిలోనే దాడుల్ని మొదలు పెట్టింది.

అప్గాన్ లోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడుల్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలోకాబూల్ ఎయిర్ పోర్టును ఖాళీ చేయాలని పౌరులకు హెచ్చరికలు పంపింది. కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద జరిపిన జంట పేలుళ్లు తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించిన నేపథ్యంలో.. అందుకు ప్రతీకార చర్యను మొదలు పెట్టింది.

కాబూల్ విమానాశ్రయం వెలుపుల జరిపిన జంట పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులు మూల్యం చెల్లించాల్సి వస్తుందని అమెరికా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా పరకటించారు. పేలుళ్లకు పాల్పడిన వారికి ధీటుగా బదులిచ్చేందుకు ప్లాన్లు సిద్ధం చేయాలని కమాండోలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే.. తాజా దాడులు జరిగినట్లుగా చెప్పాలి.
Tags:    

Similar News