కాబూల్ లో ఐసిస్ అటాక్ ను అడ్డుకున్న అమెరికా

Update: 2021-08-30 03:30 GMT
ఆత్మాహుతి దాడులతో భారీగా ప్రాణాల్ని తీసిన ఐసిస్-కె (ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్) ను తాజాగా అగ్రరాజ్యం దెబ్బ తీసింది. తాజాగా మరోసారి కాబూల్ ఎయిర్ పోర్టు వద్దకు ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు వెళుతున్న వాహనాన్ని డ్రోన్ ప్రయోగించి మరీ మట్టుబెట్టారు. సూసైడ్ బాంబర్ మీద దాడి చేయటం ద్వారా మరో విధ్వంసాన్ని అమెరికా అడ్డుకున్నట్లు చెబుతున్నారు. తాము డ్రోన్ దాడి జరిపిన విషయాన్ని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. ఈ వాహనంలో ఒకరు కాక పలువురు సూసైడ్ బాంబర్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. తాజా దాడితో మరో ఆత్మాహుతి దాడిని విజయవంతంగా అడ్డుకున్నట్లుగా చెబుతున్నారు.

పదమూడు మంది తమ సైనికుల్ని పొట్టనబెట్టుకున్న ఐసిసి కె సంగతి చూస్తామని.. వారిని వెంటాడి మరీ దాడులు చేస్తామని చెప్పిన కాసేపటికే ఈ డ్రోన్ దాడి జరిగింది. అయితే.. రానున్న 24 నుంచి 36 గంటల్లో కాబూల్ లో మరో దాడికి అవకాశం ఉందని.. విశ్వసనీయ సమాచారం తమకు అందినట్లుగాబైడెన్ పేర్కొన్నారు. కాబూల్ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో అమెరికన్లు ఎవరూ ఉండొద్దని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే కాబూల్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఒక నివాసంపైన రాకెట్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. దీంతో పలువురు ఆందోళనకు గురవుతున్నారు. తమ సైనికుల్ని.. ఆఫ్గాన్ పౌరుల ప్రాణాలు తీస్తున్న ఐసిసి-కె మూకను వదిలేదే లేదని బైడెన్ స్పష్టం చేశారు. వారు పాల్పడిన ఘాతుకానికి తగిన మూల్యం చెల్లించేలా చేస్తామన్నారు.

ఇటీవల కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో మరణించిన 13 మంది భౌతికాయాలు అమెరికాకు చేరుకున్నాయి. సతీసమేతంగా డెలవేర్ రాష్ట్రానికిచేరుకున్న బైడెన్.. కాబూల్ లో మరణించిన జవాన్లకు నివాళులు అర్పించారు.

ఆత్మాహుతి దాడిలో మరణించిన 13 మంది అమెరికన్ జవాన్లలో 11 మంది మెరైన్లు.. ఒక నేవీ సెయిలర్ ఉన్నట్లు చెబుతున్నారు. మెరైన్లలో ఒక మహిళ ఉండటం గమనార్హం.
Tags:    

Similar News