అమెరికాలో ఇక గల్ఫ్ బతుకేనా..?

Update: 2017-03-25 06:54 GMT
వీసాల గడువు ముగిసి - ఉండడానికి అనుమతులు లేక గల్ఫ్ దేశాల్లో బిక్కుబిక్కుమంటూ బతికిన భారతీయులు.. ఏజెంట్ల మోసాల్లో చిక్కుకుని సరైన పత్రాలు లేకుండానే వెళ్లి తిరిగి రాలేక చిక్కుకుపోయిన భారతీయులు పడిన బాధలు తెలిసినవే. ఇప్పటికీ అవి గల్ఫ్ దేశాల్లో ఎక్కడో ఒక చోట కనిపిస్తున్నవే. ఇకపై అమెరికాలోనూ అలాంటి పరిస్థితులు రానున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  ట్రంప్ ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు.. అక్కడి పరిస్థితులు కొంత ఆందోళనకరంగానే ఉన్నాయని అమెరికాలోని భారతీయులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న వందలాది మంది భారతీయులపై వేటు వేసేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమవడం కలకలం రేపుతోంది.
    
మొత్తం 271 మంది భారతీయులపై వేటు వేయనున్నట్టు ట్రంప్ కార్యాలయం సమాచారం పంపినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. అయితే, వేటు వేయనున్న వారి జాబితాను బహిష్కరణకు ముందే తమకు అందజేయాలని అమెరికాను కోరినట్టు ఆమె తెలిపారు.
    
వేటుకు గురి కాబోతున్న వారి జాతీయతను తాము పరిశీలించకముందే, వారందరూ అమెరికాలో అక్రమంగా ఉన్నారనే విషయాన్ని తాము ఎలా విశ్వసించగలమని తాము ప్రశ్నించినట్టు సుష్మ తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించాలని కోరామని చెప్పారు.  కాగా.. ఇలాంటి జాబితాలు మరిన్ని వస్తాయని.. అసలు దీనికి ప్రాతిపదిక ఏంటో కూడా చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో భారతీయులకు కష్టాలు తప్పేలా లేవని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News