భార‌త్‌ కు తీపి క‌బురు..పాక్‌ కు షాకిచ్చిన అమెరికా

Update: 2017-07-15 18:07 GMT
అమెరికాతో భార‌త ర‌క్ష‌ణ సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డ‌నున్నాయి. భార‌త్‌ తో ర‌క్ష‌ణ స‌హ‌కారాన్ని కొన‌సాగించేందుకు అమెరికా స‌రికొత్త విధానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. తాజాగా అమెరికాకు చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల(హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌) స‌భ 621 బిలియ‌న్ డాల‌ర్ల రక్ష‌ణ బిల్లుకు ఆమోదం తెలిపింది. బిల్లు స‌వ‌ర‌ణను భార‌త సంత‌తికి చెందిన ఎంపీ అమిబెరా ప్ర‌తిపాదించారు. మూజువాణీ ఓటు ద్వారా దీన్ని అంగీక‌రించారు. 344-81 ఓట్ల తేడాతో డిఫెన్స్ ఫండింగ్‌ కు  ఆమోదం ద‌క్కింది. ఈ ఏడాది అక్టోబ‌ర్ ఒక‌టి నుంచి నిధుల‌ను విడుద‌ల చేస్తారు.

అయితే భార‌త్‌ తో రక్ష‌ణ ఒప్పందానికి సంబంధించి ర‌క్ష‌ణ శాఖ మంత్రి అనుమ‌తి అవ‌స‌రం ఉంటుంది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కూడా ఈ అంశంలో స‌హ‌క‌రిస్తారు. రెండు దేశాల మ‌ధ్య ఆధునిక డిఫెన్స్ స‌హ‌కారాన్ని పెంపొందించేందుకు వాళ్లు ప్ర‌య‌త్నిస్తారు. అమెరికాది అతి పురాత‌న ప్ర‌జాస్వామ్య‌మ‌ని, భార‌త్‌ది అతి పెద్ద ప్ర‌జాస్వామ్యం అని, రెండు దేశాల మ‌ధ్య ర‌క్ష‌ణ స‌హ‌కారానికి ఓ వ్యూహాం అవ‌స‌ర‌మ‌ని ఎంపీ అమిబెరా అన్నారు. ర‌క్ష‌ణ ఒప్పందం ద్వారా 21వ శ‌తాబ్ధంలో ఎదుర‌వుతున్న స‌వాళ్ల‌కు ప‌రిష్కారాలు దొరుకుతాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. నేష‌న‌ల్ డిఫెన్స్ ఆథ‌రైజేష‌న్ యాక్ట్‌కు ఆమోదం ద‌క్క‌డం వ‌ల్ల ఆ దేశ ర‌క్ష‌ణ శాఖ‌ 180 రోజుల్లో వ్యూహాత్మ‌క విధానాన్ని డెవ‌ల‌ప్ చేయాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత అమెరికా, భార‌త్ మ‌ధ్య ర‌క్ష‌ణ బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుంది.

మ‌రోవైపు పాకిస్థాన్‌ కు డిఫెన్స్ ఫండింగ్ ఇబ్బందిక‌రంగా మారింది. ఉగ్ర‌వాద నిర్మూల‌న కోసం స‌రైన చ‌ర్య‌లు తీసుకుంటేనే పాకిస్థాన్‌కు ర‌క్ష‌ణ శాఖ నిధులు విడుద‌ల చేస్తామ‌ని అమెరికా స్ప‌ష్టం చేసింది. ఉగ్ర చ‌ర్య‌ల‌పై స‌రైన ప్ర‌గ‌తిని చూపిస్తేనే ఇక నుంచి పాక్‌కు నిధుల మంజూరీ జ‌రుగుతుంది. పాకిస్థాన్‌లోని ఉత్త‌ర వ‌జీరిస్తాన్‌లో హ‌క్కాని నెట్‌వ‌ర్క్ ఆగ‌డాలు ఎక్కువ‌య్యాయి. అయితే ఆ నెట్‌వ‌ర్క్‌ను పాక్ అడ్డుకుంటేనే ఆ దేశానికి నిధులు విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి. పాక్‌ - ఆఫ్ఘ‌న్ బోర్డ‌ర్ మ‌ధ్య ఉగ్ర కార్య‌కలాపాల‌ను నిలువ‌రించాల్సి వ‌స్తుంది. పాకిస్థాన్ చ‌ర్య‌ల‌పై పెంట‌గాన్ స‌మాచారం ఇచ్చిన త‌ర్వాత‌నే ర‌క్ష‌ణ‌ నిధుల విడుద‌ల‌కు మోక్షం ద‌క్కే సూచ‌న‌లున్నాయి.
Tags:    

Similar News