ఉత్త‌మ్ మాట‌తో ఉద్య‌మ కేసీఆర్ నిద్ర లేస్తారా?

Update: 2018-06-25 07:49 GMT
రాజ‌కీయాల్లో ఎప్పుడేం జ‌రుగుతుందో అస్స‌లు చెప్ప‌లేం. అప్ప‌టివ‌ర‌కూ మామూలుగా ఉండే రాజ‌కీయం ఒక్కమాట మాత్రం సీన్ మొత్తం మారిపోవ‌ట‌మే కాదు.. వాతావ‌ర‌ణం కాస్తా వేడెక్కి పోతోంది. తాజాగా అలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. ఇప్ప‌టివ‌ర‌కూ స‌వాల్‌ కు ప్ర‌తిస‌వాల్ విసిరే త‌త్త్వం ఉన్న కేసీఆర్.. తాజా ప‌రిణామాల‌తో ఇప్పుడెలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాజ‌కీయం మొత్తంగా మారిపోయే ప‌రిస్థితి. నోటి మాట కాకుండా.. ట్విట్ట‌ర్ లో ట్వీట్ రూపంలో త‌న ప్ర‌తిస‌వాల్ విసిరిన ఉత్త‌మ్ కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏం స‌మాధానం ఇస్తార‌న్న‌ది ఇప్పుడు స‌స్పెన్స్ గా మారింది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌..మాజీ మంత్రి దానం నాగేంద‌ర్ టీఆర్ఎస్‌లో చేరిన వైనం తెలిసిందే.

అధికారికంగా నిన్న పార్టీలో చేరిన సంద‌ర్భంలో ఒక స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌లో ప్ర‌సంగించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. తాను ముంద‌స్తుకు సిద్ధ‌మంటూ స‌వాల్ విసిరారు. ఎప్పుడంటే అప్పుడు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌న్న కేసీఆర్‌.. విప‌క్షాలు అందుకు సిద్ధ‌మా? అంటూ ఛాలెంజ్‌చేశారు. ఎన్నిక‌లు ఎప్పుడెప్పుడు వ‌స్తాయ‌న్న‌ట్లుగా ఉన్న టీ కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వెనువెంట‌నే రియాక్ట్ అయ్యారు.

కేసీఆర్ స‌వాల్‌కు ప్ర‌తిస‌వాల్ విసురుతూ.. ముఖ్య‌మంత్రి చేసిన స‌వాల్ ను తాను స్వీక‌రిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ సిద్ధంగా ఉండ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఎన్నిక‌లు డిసెంబ‌రు లేదంటే మే లో ఎప్పుడొచ్చినా సిద్ద‌మేన‌న్న ఆయ‌న‌.. ముంద‌స్తు ఎన్నిక‌లు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త అని..అవినీతి.. అక్ర‌మాల టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు పూర్తిస్థాయిలో తాము స‌న్న‌ద్ధంగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

ఉత్త‌మ్ ట్వీట్ ప్ర‌తిస‌వాల్ తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఉత్కంట‌గా మారింది. ఉద్య‌మ స‌మ‌యంలో ఇలాంటి స‌వాళ్లు విసిరిన వెంట‌నే.. త‌మ పార్టీ నేత‌ల చేత వెనువెంట‌నే రాజీనామాలు చేయించేసి.. ఉప ఎన్నిక‌ల గోదాలోకి దిగిన కేసీఆర్‌.. తాజాగా ఉత్త‌మ్ ప్ర‌తిస‌వాల్‌తో అదే ప‌ని చేస్తారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఒక‌వేళ‌.. ఉద్య‌మ కేసీఆర్ నిద్ర లేచి.. ముంద‌స్తుకు సిద్ధ‌మైతే.. తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కిపోవ‌టం ఖాయం. తాను చెప్పాల్సింది ట్వీట్‌తో చెప్పేసిన ఉత్త‌మ్‌.. బాల్ ని కేసీఆర్ కోర్టులో ప‌డేసిన‌ట్లే. మ‌రి.. కేసీఆర్ రియాక్ష‌న్ ఏమిట‌న్న‌దే ఇప్పుడు స‌స్పెన్స్ గా మారింది.
Tags:    

Similar News