కేసీఆర్ ఇరుకున పడేలా ఉత్తమ్ భారీ సవాల్

Update: 2020-01-19 07:57 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాజాగా కాంగ్రెస్ ఎంపీ కమ్ టీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ సవాల్ విసిరారు. తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న పుర ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని ఆయన నల్గొండలో చేపట్టారు. పట్టణంలోని పాతబస్తీలో నిర్వహించిన ప్రచార వేళ.. మీడియాతో మాట్లాడుతూ గులాబీ బాస్ కు సవాలు విసిరారు.

సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేసిందని.. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే.. ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైనా ఏదైనా సవాలు విసిరనంతనే స్పందించే గుణం కేసీఆర్ కు తక్కువే. కాకుంటే.. తనకు రాజకీయ లబ్థి చేకూరుతుందంటే మాత్రం గంటల్లో రియాక్ట్ అయ్యే ఆయన.. తేడా వస్తుందంటే మాత్రం కామ్ గా ఉండిపోతారు.

ఓపక్క మజ్లిస్ తో చెట్టాపట్టాలు వేసుకు తిరిగే కేసీఆర్.. కేంద్రంలో మోడీకి కోపం రాకుండా ఉండేందుకు పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా వ్యవహరించారు. అందుకు భిన్నంగా రాష్ట్రంలో మాత్రం మజ్లిస్ తో స్నేహితుడిగా ఉన్నారు. ఇలాంటి వేళ.. మోడీకి కోపం వచ్చేలా కేసీఆర్ చేత తీర్మానం చేయిస్తే.. అది తెలంగాణ కాంగ్రెస్ కు విజయంగా మారుతుంది. ఈ వ్యూహంతోనే కేసీఆర్ ను కెలికే ప్రయత్నం చేసిన ఉత్తమ్ సవాలుకు గులాబీ బాస్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News