ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా.. కారణం అదేనా..?

Update: 2021-03-09 16:47 GMT
ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి త్రివేంద్ర సింగ్ రావ‌త్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. మంగ‌ళ‌వారం సాయ‌త్రం గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన ఆయ‌న రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. ఢిల్లీ వెళ్లొచ్చిన మ‌ర్నాడే ఆయ‌న రాజీనామా నిర్ణ‌యం తీసుకోవ‌డంతో.. అధిష్టానమే త‌ప్పించింద‌నే చ‌ర్చ సాగుతోంది.

ఫిర్యాదులు..
సీఎం రావ‌త్ తీరుపై అధిష్టానానికి సొంత ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్త‌డమే ఈ ప‌రిస్థితికి కార‌ణంగా తెలుస్తోంది. రావ‌త్ ఒంటెత్తు పోక‌డ‌తో పోతున్నార‌ని, త‌మ‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌ట్లేద‌ని అక్క‌డి ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారట‌. ఇదే విష‌యాన్ని ప‌లుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయిన‌ప్ప‌టికీ ప‌రిస్థితిలో మార్పు రాలేద‌ని స‌మాచారం. ప్ర‌ధానంగా ఓ ప‌ది మంది ఎమ్మెల్యేలు గ్రూపుగా ఏర్ప‌డి అధిష్టానంపై ఒత్తిడి పెంచార‌ట. ఈ క్ర‌మంలో ప‌రిశీల‌కుల‌ను కూడా పంపిన అధిష్టానం.. నివేదిక తెప్పించుకుంది.

సీఎంకు వ్య‌తిరేకంగా..
ప‌రిశీల‌కులు ఇచ్చిన నివేదిక ముఖ్య‌మంత్రి రావ‌త్ కు వ్య‌తిరేకంగానే ఉన్న‌ట్టు స‌మాచారం. దీంతో.. హుటాహుటిన ఢిల్లీ పిలిపించుకున్న నేత‌లు.. రాజీనామా చేయాల్సిందిగా సూచించారనే ప్ర‌చారం సాగుతోంది. అధిష్టానం సూచ‌న మేర‌కే రావ‌త్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశార‌ని స‌మాచారం.

వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు..
ఉత్త‌రాఖండ్ లో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. 2017లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మొత్తం 70 స్థానాలకు గానూ.. బీజేపీ ఏకంగా 57 చోట్ల విజ‌యఢంకా మోగించింది. అలాంటిది.. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉండ‌గా.. ఈ గ్రూపు త‌గాదాలు కొన‌సాగ‌డం స‌రికాద‌ని అధిష్టానం భావించింద‌ట‌. మ‌ళ్లీ అధికారం సాధించాలంటే.. క‌లిసి క‌ట్టుగా ఎన్నిక‌లకు వెళ్తేనే సాధ్య‌మ‌వుతుంద‌ని సీఎం మార్పు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News