ఉత్తరాఖండ్ ఒక్క రోజు సీఎంగా ఓ యువతి...కారణమిదే

Update: 2021-01-24 02:30 GMT
సాధారణంగా మేక్ ఎ విష్ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలతో పోరాడుతున్న వారికి ఒక్క రోజు ముఖ్యమంత్రిగా, ఒక్క రోజు పోలీస్ బాస్ గా పనిచేసే అవకాశాన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కల్పిస్తుంటాయి. అయితే, ఉత్తరాఖండ్ లో మాత్రం ఆరోగ్యంగా ఉన్న ఓ సాధారణ యువతి సినీ ఫక్కీలో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించనుంది. జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని హరిద్వార్‌ జిల్లా, దౌలత్‌పూర్‌ గ్రామానికి చెందిన సృష్టి గోస్వామికి ఈ అరుదైన అవకాశం దక్కింది. దీంతో, 20 ఏళ్లు వయసున్న సృష్టి సీఎంగా బాధ్యతలు చేపట్టనుంది. బీఎస్సీ చదువుతున్న సృష్టిని ఒక్కరోజు సీఎంగా ఉత్తరాఖండ్‌ బాలికల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఎంపిక చేసింది.

ప్రతి సంవత్సరం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అందులో భాగంగానే ఉత్తరాఖండ్‌ బాలికల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సృష్టిని ఒక్కరోజు ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే రేపు ఉత్తరాఖండ్‌ వేసవి రాజధాని గైర్‌సెన్‌లో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌తో కలిసి సృష్టి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై సమీక్ష నిర్వహించనుంది. సృష్టి గోస్వామి 2018లో ఉత్తరాఖండ్‌ బాలల అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది. 2009లో థాయిలాండ్‌లో జరిగిన బాలికల అంతర్జాతీయ లీడర్‌షిప్‌ కార్యక్రమానికి సృష్టి హాజరైంది. సృష్టి తండ్రి ఒక చిన్న దుకాణం నడుపుతుండగా, ఆమె తల్లి అంగన్వాడీ నిర్వహిస్తున్నారు.




Tags:    

Similar News