పంతం నెగ్గించుకున్న వీహెచ్.. ఇక పార్టీలో ముస‌ల‌మే..!

Update: 2022-01-30 14:29 GMT
తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ హ‌నుమంత‌రావు పార్టీలో త‌న పంతం నెగ్గించుకున్నారా..?  పార్టీ పెద్ద‌లు జోక్యం చేసుకుని స‌ర్ది చెప్పినా పెద్దాయ‌న ప‌ట్టు విడ‌వ‌లేదా..? మ‌రో సీనియ‌ర్ నేత‌కు నోటీసులు ఇప్పించి త‌న కోపం చ‌ల్లార్చుకున్నారా..? అస‌లు స‌మ‌స్య ఇప్పుడే మొద‌లైందా..? పార్టీలో తిరుగుబాటు మొద‌లు కానుందా..? అంటే ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప‌రిశీలిస్తే అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు పార్టీ నేత‌లు. ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు విన‌తి ప‌త్రం ఇచ్చే కార్య‌క్ర‌మంలో భాగంగా పార్టీ సీనియ‌ర్ నేత వి హ‌నుమంత‌రావు ఇటీవ‌ల మంచిర్యాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఆయ‌న‌తో పాటు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయ‌క్‌, మాజీ మంత్రి వినోద్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అయితే వీరి ప‌ర్య‌ట‌న‌ను మాజీ ఎమ్మెల్సీ.. మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి కొక్కిరాల ప్రేం సాగ‌ర్ రావు అనుచ‌రులు అడ్డుకుని వాహ‌నంపై దాడి చేశారు.

ఇది త‌న సీనియారిటీకి జ‌రిగిన అవ‌మానంగా భావించిన వీహెచ్ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీకి ఫిర్యాదు చేశారు. ప్రేం సాగ‌ర్ రావుపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని ప‌ట్టుప‌ట్టారు. దీంతో చిన్నా రెడ్డి మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో ప్రేంసాగ‌ర్ రాజీ కోసం ప్ర‌య‌త్నించారు. ఇద్ద‌రూ క‌లిసి వీహెచ్ ఇంటికి వెళ్లినా ఆయ‌న‌ అల‌క వీడ‌లేదు. చ‌ర్య‌లు తీసుకోక‌పోతే గాంధీ భ‌వ‌న్ ఎదుట దీక్ష చేస్తాన‌ని వీహెచ్ హెచ్చ‌రించారు. దీంతో చేసేదేమీ లేక క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ చైర్మ‌న్ చిన్నా రెడ్డి ప్రేం సాగ‌ర్ రావుకు నోటీసులు జారీ చేశారు.

ఇక అస‌లు స‌మ‌స్య ఇక్క‌డే మొద‌లు కానుంది. మాజీ ఎమ్మెల్సీ ప్రేం సాగ‌ర్ సాధార‌ణ వ్య‌క్తి కాదు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ను శాసించ‌గ‌ల‌రు. పార్టీ కార్య‌క్ర‌మాలు మొద‌లుకొని.. టికెట్ల వ‌ర‌కు త‌న క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంది. పార్టీకి పూర్తి ఆర్థిక అండ‌దండ‌లు అందించ‌గ‌ల‌రు. ఇంద్ర‌వెల్లి స‌భ విజ‌య‌వంతం కావ‌డానికి కూడా ఆయ‌నే కార‌ణం. అలాంటి వ్య‌క్తికి నోటీసులు ఇవ్వ‌డం మామూలు విష‌యం కాదు. ఈ నోటీసుల విష‌యాన్ని ప్రేం సాగ‌ర్ ఎలా తీసుకుంటార‌నే దానిపైనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

దీనికి ప్ర‌ధాన కార‌ణం ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని మ‌రో సీనియ‌ర్ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డితో ఉన్న గొడ‌వ‌లే. పార్టీ అధిష్ఠానం త‌న‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌కుండా మ‌హేశ్వ‌ర్ రెడ్డిని ప్రోత్స‌హిస్తోంద‌ని ప్రేం సాగ‌ర్ అనుమానం. అందుకే వీహెచ్ ఘ‌ట‌న జ‌రిగింది. ఇపుడు నోటీసుల‌తో ప్రేం సాగ‌ర్ అవ‌మానంగా భావించి ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే అది పార్టీకే ప్ర‌మాదం. పార్టీని వ్య‌తిరేకించిన కోమ‌టి రెడ్డి లాంటి వాళ్ల‌ను వ‌దిలి త‌న‌కు నోటీసులు ఎలా ఇస్తార‌ని ప్రేం సాగ‌ర్ ప్ర‌శ్నిస్తున్నారు. ఈ నోటీసుల అంశం టైంపాస్ గా ముగుస్తుందా.. లేదా పార్టీలో ఏదైనా ఉప‌ద్ర‌వం ముంచుకొస్తుందా.. అని పార్టీ నేత‌లు సందేహిస్తున్నారు.
Tags:    

Similar News