గుడ్ న్యూస్..కరోనా నివారణకు మందు

Update: 2020-03-14 08:28 GMT
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను ప్రపంచ దేశాలన్నీ నియంత్రించలేకపోతున్నాయి. కరోనా తీవ్ర రూపం దాలుస్తున్నా దాని నివారణకు మందు లేదు. దీంతోనే ఆ వైరస్ విశ్వవ్యాప్తమవుతోంది. అందుకే అగ్రరాజ్యాలు కూడా ఆ వైరస్ ను నియంత్రించలేకపోతున్నాయి. మెడిసిన్ లభిస్తే ఆ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడనుంది. దీనిపై ఇప్పటికే పలు కంపెనీలతో పాటు దేశాలు మందు కనుగొనేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. ఎలాగైనా కరోనా నివారణకు మందు కనుగొని ఆ వైరస్ ను కట్టడి చేయాలని ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా కరోనా నివారణకు మందు కనుగొన్నట్లు కెనడాకు చెందిన ఓ సంస్థ ప్రకటించింది.

కొవిడ్- 19 వైరస్‌ నివారణకు వ్యాక్సిన్‌ తమ దగ్గర ఉన్నట్లు కెనడాకు చెందిన మెడికాగొ కంపెనీ తెలిపింది. వైరస్ జన్యు నిర్మాణం లభించిన 20 రోజుల్లోనే వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు ఆ కంపెనీకి చెందిన చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఆ మందు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి రాదని.. పలు సంస్థల నియమనిబంధనలు - అడ్డంకులు ఏవి లేకపోతే 2021 నవంబర్ లో ఈ మందు అందుబాటులోకి వస్తుందని మెడికాగో సీఈఓ బ్రూస్ క్లార్క్ పేర్కొన్నారు. సరికొత్త సాంకేతికత సాయంతో రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ ను ఎఫ్‌ డీఏ అనుమతి కోసం పంపారంట.

ఈ మందుకు రెగ్యులేటరీ అడ్డంకులు తొలగిపోతే నెలకు 10 మిలియన్ మోతాదులో మెడిసిన్‌ ను ఉత్పత్తి చేయగలదని, నవంబర్ 2021 నుంచి ఈ మందు అందుబాటులో వస్తుందని వివరించారు. ఈ వ్యాధి నివారణకు రూపొందించిన తమ మందు వంద శాతం కరోనాను నివారిస్తుందని ధీమాగా ఆ సంస్థ సీఈఓ బ్రూస్ క్లార్క్ చెబుతున్నారు. ఇప్పటికే తాము కరోనా నివారణకు మందు రూపొందించామని పలు దేశాలు, కంపెనీలు చెబుతున్నా వాటివి నమ్మే పరిస్థితు లేవని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే తాము తయారీ చేసే విధానం చూస్తే కరోనాకు అడ్డకట్ట పడనుందని మీరే చెబుతారని తెలిపారు.

కోడిగుడ్లకు బదులు మొక్కలను బయో రియాక్టర్‌గా ఉపయోగించామని చెప్పారు. వ్యాక్సిన్స్ తయారీకి గుడ్లను సహజంగా వాడతారు. కానీ చాలా ఖరీదైన వ్యవహారంతో పాటు సమయం కూడా అధికంగా పడుతుందని గుర్తించి ప్రత్యామ్నాయం ఆలోచించినట్లు వివరించారు. అయితే తమ మెడికోగో సంస్థ లైవ్ వైరస్‌ తో పని చేయదని - పదేళ్లుగా  మొక్కలను ఉపయోగిస్తూ వ్యాక్సిన్ ప్రోటీన్లను వృద్ధి చేస్తూ వస్తున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. ఈ ప్రక్రియలో జెనెటిక్ సీక్వెన్స్‌ ను అగ్రోబ్యాక్తీరియం అనే మట్టి బ్యాక్టీరియాలోకి పంపితే మొక్కలు వ్యాక్సిన్‌ గా వాడే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయంట.

అయితే కోవిడ్ 19 లాంటి వైరస్‌ వ్యాప్తి చెందితే కొత్త మొక్కలను ఉపయోగించి ఆ ప్రక్రియను అప్డేట్ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ విధంగానే తమ ప్రక్రియకు - గుడ్లతో చేసే ప్రక్రియకు చాలా తేడాలు ఉన్నాయని.. తాము వైరస్‌ ను వ్యాప్తి చెందకుండా వ్యాక్సిన్‌ లేదా యాంటీ బాడీలను ఉత్పత్తి  చేస్తామని క్లార్క్ వివరించారు. దీన్ని బట్టి చూస్తే కరోనా నివారణకు ఇప్పట్లో మందు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.

Tags:    

Similar News