ఆంధ్రోళ్లే ఆంధ్రా పాలిట శాపమా?

Update: 2015-04-11 04:30 GMT
కాస్త చిత్రంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆంధ్రా మూలాలు ఉన్న వ్యక్తులే ఆంధ్రా ప్రాంతానికి శాపంగా మారారని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన పోలికను ఒకటి చేస్తున్నారు. తాజాగా శేషాచల అడవుల్లో ఎర్రచందనం దుంగల్ని దొంగలించే దొంగలు కమ్‌ స్మగ్లర్లపై ఏపీ పోలీసులు.. అటవీశాఖ అధికారులు విరుచుకుపడి భారీ ఎన్‌కౌంటర్‌ చేయటం తెలిసిందే. ఆ ఘటనలో 20 మంది మృతి చెందారు. చనిపోయిన వారంతా తమిళనాడుకు చెందిన వారని తేలటంతో తమిళనాడు రాజకీయ నేతలు మండిపడ్డారు.

మిగిలిన వారందరి కంటే వైగో ఎక్కువగా రియాక్ట్‌ కావటమే కాదు.. ఏపీలోని చిత్తూరులో ధర్నా చేస్తానని హెచ్చరించటం మొదలు.. తమిళనాడులోని ఏపీ ఆస్తులపై దాడి చేయాలంటూ చాలానే మాటలు అనేశారు. ఈ సందర్భంగా వైగో గురించి చర్చ మొదలైంది. ఈ సందర్భంగా పలువురు విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన పోలికను తీసుకొస్తూ.. ఆంధ్రా మూలాలు ఉన్న వారే ఆంధ్రాకు వ్యతిరేకులుగా.. ఆంధ్రుల పాలిట శాపంగా మారారని చెబుతున్నారు.

ఆంధ్రాలోని విజయనగరం జిల్లా ప్రాంతానికి చెందిన కేసీఆర్‌ (తాతల కాలానికి చెందిన వారు విజయనగరం జిల్లా వారని అంటుంటే.. కేసీఆర్‌ మాత్రం అదేం కాదని వాదించటం మరో వాదన) తెలంగాణ వాదాన్ని భుజాన వేసుకోవటమే కాదు.. తెలంగాణ యాసతో అక్కడి సంస్కృతిని చర్చనీయాంశంగామార్చి ఏపీని రెండు ముక్కలు చేయటంలో ఎంత కీలకపాత్ర పోషించారో తెలిసిందే.

ఇక వైగో విషయానికి వస్తే.. కృష్ణా జిల్లాకు చెందిన యలమంచలి గోపాలస్వామి కాస్తా వైగోగా మారిపోయి తమిళవాదాన్ని భుజాన వేసుకొని.. తమిళవాదాన్ని.. తమిళులకు ఏం జరిగినా ప్రాణం ఇచ్చే వ్యక్తిగా పేరొందిన విషయం తెలిసిందే.

ఇలా ఆంధ్రా ప్రాంత మూలాలు ఉన్న వ్యక్తులే ఆంధ్రా వ్యతిరేకులుగా మారటమే కాదు.. లేనిపోని ఉద్రిక్తలకు తావిచ్చేలా చేయటంలో ఇద్దరు నేతలు ఆంధ్రాకు చాలానే నష్టం చేశారన్న విశ్లేషణ తీసుకొస్తున్నారు. అయితే.. దీన్ని కొట్టిపారేసే వారున్నారు. ఆంధ్రుల్లో అంత చైతన్యమే ఉంటే ఒక కేసీఆర్‌.. ఒక వైగోకే అంత ఉలిక్కిపడటం ఎందుకు? అలాంటి వారు మరికొందరు బయటకు వచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవంపై మాట్లాడొచ్చుగా అని విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News