'వందే భారత్' .. మూడో రోజు సమస్యలే?

Update: 2022-10-09 04:04 GMT
ప్రధాని నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టుగా చెప్పే ‘వందే భారత్’ మూడు రోజుల క్రితం గ్రాండ్ గా పట్టాల మీదకు ఎక్కటం తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రైలు.. పట్టాల మీదకు ఎక్కిన రోజు నుంచి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. మొదలైన రోజు నుంచి మూడో రోజు వరకు నిత్యం ఏదో ఒక నెగిటివ్ ఇష్యూతో వార్తల్లో నానుతోంది ఈ రైలు బండి. ముంబయి - గాంధీ నగర్ మధ్య నడిచే ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మొదటి రెండు రోజులు పశువుల్ని ఢీ కొట్టి ఆగిపోవటం.. దెబ్బ తినటం తెలిసిందే.

ముచ్చటగా మూడో రోజున కూడా ఈ రైలుకు సంబంధించిన నెగిటివ్ న్యూస్ బయటకు వచ్చింది. మూడో రోజున పట్టాల మీదకు వచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో సాంకేతిక సమస్య ఏర్పడినట్లుగా చెబుతున్నారు. శనివారం న్యూఢిల్లీ నుంచి వారణాసికి బయలుదేరిన ఎక్స్ ప్రెస్ రైలులో ట్రాక్షన్ మోటార్ జామ్ కావటంతో ఈ రైలు మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి. ధన్ కౌర్ - వెయిర్ స్టేషన్ల మధ్య నిలిచిపోయిన ఈ రైలుకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న రైల్వే ఆపరేషన్స్ కంట్రోల్ వ్యవస్థను అప్రమత్తం చేసి.. సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు.

పట్టాల మీద పరుగులు తీస్తున్న ఈ రైలులోని సాంకేతిక సమస్యను గుర్తించిన వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే రైలును ఖుర్జా  రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లి.. అక్కడ నిలిపి వేశారు. దాదాపు ఐదు గంటల పాటు కసరత్తు చేసినా.. సమస్య పరిష్కారం కాలేదు. దీంతో.. ప్రయాణికుల్ని ఆ రైలులో నుంచి శతాబ్ది ఎక్స్ ప్రెస్ లోకి మార్చి.. గమ్యస్థానానికి చేర్చారు. సమస్యకు కారణం ఏమిటన్న విషయాన్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తే కానీ చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి వందే భారత్ రైలును మొదలు పెట్టిన రోజు నుంచి వరుస పెట్టి మూడు రోజులుగా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉండటం గమనార్హం.
Tags:    

Similar News