ట్రంప్ కుమారుడికి షాక్‌..భార్య డైవ‌ర్స్ నోటీస్‌

Update: 2018-03-16 08:08 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో క‌ల‌క‌లం రేగింది. ఆయ‌న కుమారుడు ట్రంప్ జూనియర్ - అతని భార్య వనెసా ట్రంప్ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ వేరుకానున్నట్లు సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. పెళ్లి అయిన 12 ఏళ్ల తర్వాత తాము విడిపోయేందుకు నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తమ తమ కుటుంబాల పట్ల గౌరవం ఉందని, తమకు అయిదుగురు పిల్లలు ఉన్నారని, వాళ్లే తమ ప్రయార్టీ అని, ఈ సమయంలో ప్రైవసీని ఆశిస్తున్నట్లు జూనియర్ ట్రంప్ దంపతులు ఇద్దరూ ప్రకటనలో తెలిపారు.

మన్‌ హటన్‌ లోని సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్ కోడలు డైవర్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు రెండు రోజల క్రితం మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై వివరణ ఇచ్చేందుకు వైట్‌ హౌజ్ తిరస్కరించింది. 2003లో ట్రంప్ జూనియర్ తన భార్య వనెసాను ఫ్యాషన్ షోలో కలుసుకున్నారు. డొనాల్డ్ ఆ ఇద్దర్నీ ఇంట్రడ్యూస్ చేశారు. 2005లో వాళ్లు పెళ్లి చేసుకున్నారు.

కాగా, కొద్దికాలం క్రితం ట్రంప్ జూనియ‌ర్ భార‌త్‌ లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తన తండ్రి అధ్యక్ష పదవి తమ కుటుంబ స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) వ్యాపారానికి ప్రతికూలంగా మారిందని జూనియర్ వెల్లడించారు. అయితే అధ్యక్ష పదవీకాలం ముగిసిన తర్వాత తమ తండ్రి కుటుంబ వ్యాపారంలోకి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన 2017 జనవరి నుంచి భారత్‌లో ట్రంప్ ఆర్గనైజేషన్ ఎలాంటి వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేయలేదని తెలిపారు.
Tags:    

Similar News