రూ.30 కోట్లిస్తే టీడీపీ టిక్కెట్

Update: 2018-12-19 15:14 GMT
తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ కావాలంటే ఎంత సమర్పించుకోవాలి.. ఏమాత్రం డబ్బులుండాలి... బేరసారాలు ఎలా ఉంటాయన్నది..  ఆ పార్టీ నేత ఒకరు తాజాగా వెల్లడించారు. అంతేకాదు.. తాను చెప్పిన మొత్తం తెస్తే టిక్కెట్ ఇప్పిస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం సంచలనంగా మారింది.
   
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రొద్దుటూరులో పోటీ చేయదలచుకున్న నేతలెవరైనా రూ 30 కోట్లు తెస్తే తాను టిక్కెట్టిప్పిస్తానంటూ అక్కడి మాజీ ఎంఎల్ఏ వరదరాజులురెడ్డి ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఆయన ఉద్దేశపూర్వకంగా పార్టీని బజారుకీడ్చడానికి అలా అన్నారా.. లేదంటే, ఒక వర్గాన్ని ఎమ్మెల్యే టికెట్ వైపు చూడకుండా బెదిరించేందుకు ఇలా అన్నారా అన్న చర్చ జరుగుతోంది.
   
పొద్దుటూరు నియోజకవర్గంలోని బిసి సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎంఎల్ ఏ వరదరాజులురెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలోని ఓట్లలో సగానికి పైగా బిసిలే ఉన్నారని... నియోజకవర్గంలో సుమారు 2.20 లక్షల ఓట్లుంటే అందులో లక్ష ఓట్లకు పైగా బీసీలవే అంటూ బీసీ నేతలు వరదరాజుల రెడ్డితో చెప్పారు. అయితే, దీనిపై స్పందించిన ఆయన... ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉత్సాహం బాగానే ఉంది కానీ టిక్కెటొస్తే చాలదని, అందుకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు.
   
ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహం చూపుతున్న నేతలు రూ 30 కోట్లు ఖర్చు చేయటానికి కూడా ఉత్సాహం చూపితేనే బాగుంటుందన్నారు. కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టటానికి సిద్దపడకపోతే ఎన్నికల్లో పోటీ చేయటం వృధా అంటూ కుండబద్దలు కొట్టారు. రూ 30 కోట్లు ఖర్చు చేయటానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే చెప్పండి టిక్కెట్టిప్పించే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన అన్నారు. దీంతో బీసీ నేతలంతా సైలెంటయిపోయారట. అయితే.. 30 కోట్లుంటే టిక్కెటిప్పిస్తా అంటూ వరదరాజులు రెడ్డి అనడంపై టీడీపీ పెద్దలు సీరియస్ అయినట్లు సమాచారం.

Tags:    

Similar News