భారీ సంచ‌ల‌నం:ఒక్క‌టి కానున్న గాంధీ ఫ్యామిలీ!

Update: 2017-11-28 04:41 GMT
రాజ‌కీయాల్లో శాశ్విత స్నేహితులు.. శాశ్విత శ‌త్రువులు ఎవ‌రూ ఉండ‌ర‌ని చెబుతుంటారు. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు విన్న‌ప్పుడు ఈ మాట నిజ‌మ‌న్న‌ది మ‌రోసారి నిరూపితం కావ‌టం ఖాయం. 35 ఏళ్లుగా నిప్పు నీరుగా ఉంటూ.. తూర్పు ప‌డ‌మ‌ర‌లుగా వ్య‌వ‌హ‌రించిన రెండు దాయాది కుటుంబాలు ఏకం కానున్నాయా? అన్న సందేహానికి గురి చేసేలా తాజా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

భారీ రాజ‌కీయ సంచ‌ల‌నంగా భావిస్తున్న ఈ ప‌రిణామం దేశ రాజ‌కీయాల మీద తీవ్ర ప్ర‌భావితం చూపుతుంద‌ని చెప్పొచ్చు. 35 ఏళ్ల క్రితం  రెండుగా విడిపోయిన గాంధీ ఫ్యామిలీ.. తాజాగా ప్రియాంక గాంధీ తిప్పుతున్న చ‌క్రంతో మ‌ళ్లీ ఏకం కానున్నాయన్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలో అత్త ఇందిర‌మ్మ‌ను విభేదించిన మేన‌కా గాంధీ బ‌య‌ట‌కు రావ‌టంతో చీలిపోయిన ఈ కుటుంబం.. తాజాగా ప్రియాంక గాంధీ చొర‌వ‌తో మ‌ళ్లీ ఏకం కానున్న‌ట్లు చెబుతున్నారు. భార‌త ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రు కుమార్తె ఇందిర‌మ్మ అన్న‌ది తెలిసిందే. ఆమెకు ఇద్ద‌రు కుమారులు కాగా.. వారిలో ఒక‌రు సంజయ్ గాంధీ.. రెండో వారు రాజీవ్ గాంధీ. సంజయ్ గాంధీ మేన‌కాగాంధీని పెళ్లాడ‌గా.. రాజీవ్ సోనియాను వివాహ‌మాడారు.

భ‌ర్త అకాల మ‌ర‌నం.. అత్త ఇందిర‌తో విభేదాల‌తో మేన‌కా కుటుంబం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. దీంతో రాజ‌కీయ వేదిక సైతం మారిపోయింది. దాదాపు 35 ఏళ్లుగా ఈ రెండు  కుటుంబాల మ‌ధ్య సంబంధాలు లేవు. ఎదురెదురు ప‌డినా మాట్లాడుకోలేని ప‌రిస్థితి. అలాంటి రెండు కుటుంబాలు ఇప్పుడు ఏకం అయ్యే దిశ‌గా ప్ర‌య‌త్నాలు సాగుతున్న‌ట్లుగా చెబుతున్నారు.2019 నాటికి ఈ క‌ల‌యిక పూర్తి కావాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

బీజేపీలో ఉన్న మేన‌క‌.. ఆమె కుమారుడు వ‌రుణ్ గాంధీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త‌మ‌ను నిర్ల‌క్ష్యం చేయ‌టంతో పాటు.. త‌మ‌ను త‌ర‌చూ అవ‌మానాల‌కు గురి చేస్తున్న‌ట్లుగా వారు భావిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో మోడీ దెబ్బ‌కు కాంగ్రెస్ కుదేలు కావ‌టం.. మోడీ స‌మ్మోహ‌నా శ‌క్తి ముందు సోనియా.. రాహుల్ గాంధీలు తేలిపోవ‌టంతో స‌రికొత్త కాంబినేష‌న్ తో చెక్ చెప్పాల‌ని భావిస్తోంది. ఇందులో భాగంగా  ప్రియాంకా స్వ‌యంగా రంగంలోకి దిగిన‌ట్లుగా చెబుతున్నారు.

సోనియాతో పాటు..రాహుల్ కు సైతం మార్గ‌ద‌ర్శ‌నం చేసే అల‌వాటు ఉన్న ప్రియాంకా చొర‌వ‌తోనే దాయాది కుటుంబాలు ఒక్క‌ట‌య్యే అవ‌కాశం ఉంద‌ని చెప్పొచ్చు. వ‌రుణ్ గాంధీ కాంగ్రెస్ లోకి చేరేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని కాంగ్రెస్ నేత హ‌జీ మంజూర్ అహ్మ‌ద్ పేర్కొన్న‌ట్లుగా ఒక ఆంగ్ల ప‌త్రిక వార్త‌ను ప్ర‌చురించింది. బీజేపీలో మోడీ త‌ప్ప మ‌రెవ‌రినీ మాట్లాడ‌నివ్వ‌టం లేద‌ని.. అలాంటి మోడీ పాల‌న మీద త‌ప్పులు ఎత్తి చూపే ద‌మ్మున్న అతి కొద్దిమందిలో వ‌రుణ్ గాంధీ ఒక‌రుగా చెబుతుంటారు.

త‌న‌ను త‌ప్ప ప‌ట్టేవారి విష‌యంలో మోడీ ఎంత క‌ఠినంగా ఉంటారో తెలిసిందే. ఇదే వ‌రుణ్ రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. ఇదే స‌మ‌యంలో వ‌రుణ్ తో స‌త్ సంబంధాలు ఉన్న ప్రియాంక కాంగ్రెస్‌ లోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. దీనికి వ‌రుణ్ సానుకూలంగా ఉన్న‌ట్లు చెబుతారు. త‌మ్ముడితో సంప్ర‌దింపులు జ‌రిపిన ప్రియాంక.. ఆయ‌న్ను పార్టీలోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇందుకు కీల‌క‌మైన మేన‌కా గాంధీ రియాక్ష‌న్ ఏమిట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. కాంగ్రెస్ లో చేరేందుకు వ‌రుణ్ సానుకూలంగా ఉన్నా మేన‌క మాత్రం స‌సేమిరా అన‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. మేన‌క‌కు తోడికోడ‌లైన సోనియాతో అస్స‌లు ప‌డ‌ద‌ని.. అలాంట‌ప్పుడు త‌న కొడుకును కాంగ్రెస్ లోకి పంపేందుకు ఆమె ఒప్పుకోర‌ని చెబుతున్నారు. రాజ‌కీయాల్లో ఏదీ అసాధ్యం కాని నేప‌థ్యంలో ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్న అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News