కాంగ్రెస్‌ను అందుకే భూస్థాపితం చేయాలి!

Update: 2015-03-17 13:30 GMT
భారతదేశంలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదే పదే వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో చాలామంది రాజకీయ పార్టీని భూస్థాపితం ఎందుకు చేయాలి? దాని విధానాలు దానికి ఉంటాయి. ఒకసారి కాంగ్రెస్‌ అధికారంలోకి రావచ్చు. మరొకసారి బీజేపీ అధికారంలోకి రావచ్చు అని వాదిస్తూ ఉంటారు. కానీ, కాంగ్రెస్‌ను ఎందుకు భూస్థాపితం చేయాలో ఒక ఉదాహరణ సోమవారం పార్లమెంటులో జరిగింది.

తెలుగు రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు పారిశ్రామిక రాయితీలు ఇస్తే కర్ణాటక, తమిళనాడు తదితర రాస్ట్రాల్లోని పరిశ్రమలు దెబ్బతింటాయని కూడా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్నే తప్పుబట్టారు.

విచిత్రం ఏమిటంటే, ఏపీ, తెలంగాణలకు పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వమే. అప్పట్లో వీరప్ప మొయిలీ కేంద్రంలో మంత్రి కూడా. అప్పట్లో రాష్ట్ర విభజన వ్యవహారంలోనూ ఆయన క్రియాశీలంగా ఉన్నారు. అప్పట్లో ఆయన న్యాయ శాఖ మంత్రిగా ఉండడంతో రాష్ట్ర విభజన బిల్లు ఆయనకు చేరింది. దానికి ఆయన ఆమోద ముద్ర కూడా వేశారు. అప్పుడు పారిశ్రామిక రాయితీలకు ఆమోద ముద్ర వేసిన వీరప్ప మొయిలీ ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంలో వాటిని ఎందుకు వద్దని చెబుతున్నారు? ఇంకా విచిత్రం ఏమిటంటే, అప్పట్లో ఆ బిల్లును ఆమోదించిన కాంగ్రెస్‌ నేతలు మరీ ముఖ్యంగా సోనియా సభలో ఉండగానే ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఆ పార్టీ ప్రయోజనాలు కూడా వారికి అక్కర్లేదు.

కాంగ్రెస్‌ విధానాలకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఆ పార్టీకి దేశానికి సంబంధించి ఒక స్థూల దృష్టి ఉండదు. దానిది ప్రాంతీయ దృష్టికోణం. ఆ కోణంతోనే అది ఆంధ్రప్రదేశ్‌ విభజనకు నిర్ణయం తీసుకుంది. మరొకచోట నాలుగు ఓట్లు వస్తాయంటే ఎంత దారుణమైన నిర్ణయం తీసుకోవడానికి అయినా అది సిద్ధంగా ఉంటుంది. అందుకే వీరప్ప మొయిలీ ప్రసంగాన్ని సోనియా కానీ కాంగ్రెస్‌నాయకులు కానీ అడ్డుకోలేదు. కాంగ్రెస్‌ గురించి ఇటువంటివి చెప్పాలంటే గ్రంథం సరిపోదు. అందుకే కాంగ్రెస్‌ నుంచి దేశానికి విముక్తి కల్పించాలనేది!

Tags:    

Similar News