రాజ్యసభలోని ఎంపీలు అలా చేసేవారంటూ షాకింగ్ నిజాన్ని చెప్పిన వెంకయ్య

Update: 2022-09-11 04:31 GMT
ఉన్నది ఉన్నట్లుగా.. మనసులో పెద్దగా పెట్టుకోకుండా.. తన మనసులోని భావాల్ని బయటపెట్టేందుకు పెద్దగా జంకని సీనియర్ నేతల్లో ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన వెంకయ్యనాయుడు ఒకరు. అలాంటి ఆయన తాజాగా పాల్గొన్న కార్యక్రమంలో ఒక సంచలన నిజాన్ని వెల్లడించారు. పెద్దల సభగా పేర్కొంటూ వివిధ రంగాల్లోని ప్రముఖుల్ని.. సీనియర్ రాజకీయ నేతల్ని పంపే రాజ్యసభలోని ఎంపీల షాకింగ్ వ్యవహారశైలికి సంబంధించిన సంచలన విషయాల్నివెల్లడించారు వెంకయ్యనాయుడు.

తాజాగా ఆయన విజయవాడలో నిర్వహించిన ఒక సమావేశానికి హాజరయ్యారు. ఆయనకు సన్నిహితులుగా ఉన్న వారు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా విజయవాడలోనూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. చట్టసభల్లోని కొందరు సభ్యుల ప్రవర్తన చాలా ఇబ్బంది కరంగా ఉంటుందన్నారు. విమర్శలు చేయాలే కానీ దూషణలు చేయటం సరికాదన్నారు. దీన్ని నియంత్రించే బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీదా ఉంటుందని చెప్పారు.

ప్రతి పార్టీ స్వచ్ఛందంగా ప్రవర్తనా నియమావళిని రూపందించి కచ్చితంగా అమలు చేస్తేనే సాధ్యమవుతుందన్న ఆయన.. ఇటీవల రాజ్యసభలో తనకు ఎదురైన కొన్ని ఉదంతాల్ని ప్రస్తావించారు. కొందరు సభ్యులు ఇబ్బందికరంగా రాజ్యసభలో ప్రవర్తించేవారని.. అలాంటి వారిని తాను గట్టిగా మందలించినట్లు చెప్పారు. 'అనంతరం వారిని దగ్గరకు పిలిచి కూర్చోబెట్టి.. ఎందుకిలా చేస్తున్నారు? అని ఆరా తీశా. వారిలో కొందరు తాము కావాలనే అలా చేస్తున్నామని.. అలా చేసినప్పుడు తమను కోప్పడ్డాలని.. సస్పెండ్ చేయాలని చెప్పారు. అలా చేస్తే తమ పార్టీ నేతలకు ఆ వ్యవహారం నచ్చుతుందని వారు చెప్పినప్పుడు ఆశ్చర్యానికి గురి చేసింది' అంటూ చెప్పుకొచ్చారు.

వెంకయ్యనాయుడు పాతతరం రాజకీయాలకు చెందిన నేత కావటంతో ఇప్పటి నేతల తీరు ఆయనకు విస్మయానికి గురి చేసి ఉండొచ్చు. మారిన కాలానికి తగినట్లుగా  రాజకీయ పార్టీల ఎజెండాలు.. నేతల ప్రాధామ్యాలు మారిపోయాయి. తమకు పేరు తెచ్చుకునేందుకు.. తమ పేరు మీడియాలో నానేందుకు.. సంచలనాలకు కేంద్రంగా ఉండటం ద్వారా తమ ఇమేజ్ ను మరింత పెంచుకోవటానికి వీలుగా చేస్తున్న ఈ తరహా చిల్లర చేష్టలు వెంకయ్య లాంటి సీనియర్ నేతలు జీర్ణించుకోవటం కాస్తంత కష్టమైన విషయమే.
Tags:    

Similar News