టీఆర్ ఎస్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన వెంక‌య్య‌

Update: 2017-06-20 05:21 GMT
తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులైన నారా చంద్ర‌బాబు నాయుడు - కే చంద్ర‌శేఖ‌ర్ రావులకు కేంద్ర ప్ర‌భుత్వానికి చేస్తున్న ఉమ్మ‌డి అభ్య‌ర్థ‌న ఏదైనా ఉందా అంటే అది అసెంబ్లీ సీట్ల పెంపు. ఇద్ద‌రు ముఖ్యమంత్రులు సీట్లు పెంచుకునేందుకు త‌మ‌దైన శైలిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపు నేత‌ల‌కు సైతం సీట్లు పెరుగుతాయ‌నే హామీ ఇస్తూ కండువాలు మారుస్తున్నారు. అయితే ఈ ప‌రిణామానికి తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అనూహ్య‌మైన ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర మున్సిపల్‌ - ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స‌మ‌క్షంలో సీట్ల పెంపుపై బ్యాడ్ న్యూస్ చెప్పారు.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పట్టణాభివృద్ధి శాఖ కార్యక్రమాలపై ఢిల్లీలో వెంకయ్యనాయుడును ఆయన నివాసంలో కలిశారు. ఐదు నిమిషాల్లో ముగిసిన ఈ సమావేశంలో ముఖ్యంగా కరీంనగర్‌ ను స్టార్మ్‌ నగరాల జాబితాలో చేర్చడంపై కేటీఆర్‌ విన్నవించారు. అలాగే జులై నెలలో రాష్ట్రంలోని 73 పట్టణాలను బహిరంగవిసర్జన రహిత నగరాలుగా ప్రకటిస్తున్నామని, ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. సమావేశం అనంతరం వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను పెంచేందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయని  తెలిపారు. అసెంబ్లీ స్థానాల పెంపుపై ఇప్పటికే ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ - హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తో కలిసి ముసాయిదాను రూపొందించినట్టు వివరించారు. కానీ న్యాయపరమైన చిక్కుల ఎదురైన నేపథ్యంలో వాటిని పరిష్కరించి ముందుకు వెళ్లాలని భావిస్తున్నామని తెలిపారు.  కాగా అసెంబ్లీ స్థానాల పెంపును రాష్ట్ర బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారుకదా అని ప్రశ్నించగా.. వెంకయ్యనాయుడు సమాధానం దాటవేశారు.

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి సీఎం కేసీఆర్‌ మద్దతు ప్రకటించడాన్ని వెంకయ్యనాయుడు స్వాగతించారు. ఇందుకు సీఎం కేసీఆర్‌ కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిని అన్ని పార్టీలతో సంప్రదింపుల ప్రక్రియ చేపట్టిన అనంతరం ప్రకటించామని, కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అందరూ మద్దతివ్వాలని వెంకయ్యనాయుడు కోరారు. పోటీ లేకుండా ఉంటే మంచిదని తన అభిప్రాయం తెలిపారు. గతంలో నీలం సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు వివరించారు. రాష్ట్రపతి అభ్యర్థిపై పీఎం నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ తో చర్చించారని, పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారని చెప్పారు. ఇందుకు ధన్యవాదాలు తెలిపారు. తాను ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో మాట్లాడానని - ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తామని ఇదివరకే ప్రకటించారని గుర్తు చేశారు. అలాగే సీపీఐ - సీపీఎం నాయకులతో సంప్రదించినట్టు చెప్పారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో, మన్మోహన్‌ సింగ్‌ తో, తమిళనాడు సీఎంతో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మాట్లాడారని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News